Share News

Starlink India Pricing: ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూశారా

ABN , Publish Date - May 28 , 2025 | 01:14 PM

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్‌లింక్, భారతదేశంలో తన ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను (Starlink India pricing) ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ సేవలు 600 నుంచి 700 Gbps వరకు బ్యాండ్‌విడ్త్‌ను అందించనున్నాయి. అయితే వీటి ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ధరల పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Starlink India Pricing: ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూశారా
Starlink India pricing

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని అందిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్న (Starlink India pricing) స్టార్‌లింక్, అత్యాధునిక సాంకేతికతతో అతి తక్కువ ధరల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది. టెలికమ్యూనికేషన్ శాఖ వర్గాల ప్రకారం, స్టార్‌లింక్ 12 నెలల్లో 600 నుంచి 700 Gbps (గిగాబైట్స్ పర్ సెకండ్) బ్యాండ్‌విడ్త్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ సేవలు ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చనున్నాయి.


భారతదేశంలో స్టార్‌లింక్ ప్లాన్ రేట్లు

స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో సరసమైన ధరలతో పోటీపడనుందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రారంభ ప్రమోషనల్ ఆఫర్‌లో నెలకు కేవలం రూ.840 ($10) ధరకే అపరిమిత డేటా అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ధర దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం. అయితే, ఈ ధర ప్రారంభ ఆఫర్‌కు మాత్రమే పరిమితం కావచ్చు. రెగ్యులర్ ప్లాన్‌లు కొంత ఎక్కువ ధరలో ఉండవచ్చని అంచనా.


లైట్ ప్లాన్‌ను

ఉదాహరణకు సమీప దేశమైన భూటాన్‌లో స్టార్‌లింక్ రెసిడెన్షియల్ లైట్ ప్లాన్‌ను రూ.3,000, స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్‌ను రూ.4,200కు అందిస్తోంది. ఇవి వరుసగా 23-100 Mbps, 25-110 Mbps వేగాలను అందిస్తాయి. భారతదేశంలో కూడా ఇలాంటి సరసమైన ప్లాన్‌లను అందించే అవకాశం ఉంది. అదనంగా, వినియోగదారులు స్టార్‌లింక్ కిట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.20,000- రూ.30,000 వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.


స్టార్‌లింక్ ప్రత్యేకతలు

సాంప్రదాయ ఇంటర్నెట్ సేవలు వైర్‌లెస్ లేదా ఫైబర్ కేబుల్స్‌పై ఆధారపడితే, స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా నేరుగా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, ఎడారుల్లో లేదా పర్వత ప్రాంతాల్లో కూడా మంచి నెట్ కనెక్టివిటీని పొందవచ్చు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం 100-200 Mbps వరకు ఉంటుందని, భవిష్యత్తులో ఇది 600-700 Gbps బ్యాండ్‌విడ్త్‌తో అత్యధిక వేగాన్ని అందిస్తుందని ఆయా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే స్టార్‌లింక్ 125 దేశాల్లో 50 లక్షల మందికి పైగా వినియోగదారులకు సేవలను అందిస్తోంది.


భవిష్యత్తు అవకాశాలు

స్టార్‌లింక్ భారతదేశంలో సేవలను ప్రారంభించడానికి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి దేశీయ టెలికాం సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు మెరుగైన కస్టమర్ సేవలు, సులభమైన ఇన్‌స్టాలేషన్ అందుబాటులో ఉంటాయి. స్టార్‌లింక్ భారతదేశంలో 2030 నాటికి 57 లక్షల కొత్త వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 5G విస్తరణతో పాటు, స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ డిజిటల్ విప్లవానికి మరింత ఊపునిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, వ్యాపార రంగాల్లో ఇది గణనీయమైన మార్పులను తీసుకురానుంది.


ఇవీ చదవండి:

రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే అధికారిక ప్రకటన

చారిత్రాత్మక ఛేజ్ నమోదు చేసిన బెంగళూరు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 01:16 PM