Anil Ambani: అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు.. విచారణకు రావాలంటూ పిలుపు
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:30 AM
రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపు, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పింది.

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంక్ లోన్ మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇటీవల ఈడీ అనిల్ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నగదు అక్రమ రవాణ, లోన్ ఫ్రాడ్‌కు సంబంధించిన కేసులో ఈడీ జులై 24న ఈ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబైల్లో పలు చోట్ల మూడు రోజుల పాటు ఈ సోదాలు నిర్వహించారు. సుమారు 25 మందిని ప్రశ్నించారు. సీబీఐ అంతకుమునుపు రెండు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.
అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలకు యస్ బ్యాంకు 2017-18లో ఇచ్చిన రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపుపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఈడీ వర్గాలు అప్పట్లో తెలిపాయి. ఈ లోన్‌ల జారీలో బ్యాంకు అధికారులకు లంచాలు ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా ఈడీ దృష్టి సారించింది. ఆర్థిక అంశాలు క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా కొన్ని కంపెనీలకు లోన్‌ల మంజూరు, సాక్షన్ ఫైల్స్‌లో కొన్ని ముఖ్య డాక్యుమెంట్స్ లేకపోవడం, డొల్ల కంపెనీలకు రుణాల మళ్లింపు, లోన్ ఎవర్ గ్రీనింగ్ తదితర విషయాలు ఈడీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ రెయిడ్స్‌పై అప్పట్లో స్పందిస్తూ వీటి ప్రభావం తమ కార్యకలాపాలపై లేదని స్పష్టం చేశాయి. ఆర్థిక పనితీరు, షేర్ హోల్డర్‌లు, ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం పడలేదని చెప్పాయి. ఇక ఈ కేసుకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన అంశాలను నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ వంటి సంస్థలు ఈడీతో పంచుకున్నాయి. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్‌లో పలు అవకతవకలపై నివేదికను సెబీ ఈడీకి సమర్పించింది. 2017-19 మధ్య కాలంలో కంపెనీ లోన్ పోర్ట్‌ఫోలియో రెట్టింపైన విషయం పేర్కొంది. ఇక ఎస్బీఐ కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన అకౌంట్స్‌ను ఫ్రాడ్యులెంట్‌గా వర్గీకరించింది. అయితే, ఎస్బీఐ 2020లో కూడా ఆర్‌కామ్ ఖాతాలను ఫ్రాడ్యులెంట్‌గా వర్గీకరించింది. కానీ, యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఢిల్లీ హైకోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేయడంతో ఎస్పీఐ వెనక్కు తగ్గింది.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..