Health Insurance: మీ హెల్త్ బీమాతో సురక్షితంగా ఉన్నారా.. ఈ తప్పులు మాత్రం చేయకండి..
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:57 PM
ప్రస్తుత జీవనశైలిలో హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ కుటుంబ భద్రతకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. కానీ సరైన కవరేజ్ లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

సాధారణ మధ్య తరగతి ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) పాలసీ తీసుకుని తమ ఆరోగ్యానికి భరోసా ఉందని భావిస్తుంటారు. ప్రీమియం చెల్లించి, ఆ కార్డును వ్యాలెట్‌లో పెట్టుకుని జీవిస్తుంటారు. కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే గాని, దాని కవరేజ్ ఎంత, ఏ విధంగా ఉపయోగ పడుతుందనేది తెలియదు. దీని గురించి చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ వాలియా కీలక సూచనలు చేశారు. మీ పాలసీ కవరేజ్ తక్కువగా ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుందని గుర్తు చేశారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో..
పూణేకి చెందిన ఓ 38 ఏళ్ల ఐటీ ఉద్యోగి కేవలం రూ. 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కానీ, అతని తండ్రి హార్ట్ ఆపరేషన్ కోసం ఆస్పత్రి బిల్లు రూ. 7 లక్షలు దాటింది. ఆ క్రమంలో అతనికి పాలసీ కేవలం రూ.3 లక్షల బిల్లును మాత్రమే కవర్ చేసింది. మిగిలిన డబ్బు కోసం బంధువుల నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. చివరకు ఆ బిల్లు కారణంగా అతను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ మాదిరిగా వారికి తెలియకుండానే అనేక మంది తక్కువ కవరేజ్ పాలసీ తీసుకుని మోసపోతున్నారని గుర్తు చేశారు అభిషేక్.
తక్కువ ప్రీమియం చెల్లించాలని..
దేశంలో ప్రతి ఏటా కూడా ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొన్ని రోజులు ఉంటే చాలు మీ ఆదాయం క్షణాల్లో ఖాళీ అవతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందే ఎక్కువ కవరేజ్ పాలసీ తీసుకోవాలని సూచించారు. చాలా మంది ప్రీమియం తక్కువ చెల్లించాలని, తక్కువ కవరేజ్‌తో సరిపెట్టుకుంటారు. లేదా కంపెనీ గ్రూప్ పాలసీపై ఆధారపడతారు. కానీ ఆరోగ్య రంగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత గతంలో కవరేజ్ ఇప్పుడు సరిపోదని గుర్తు చేస్తున్నారు.
అత్యవసర సమయాల్లో..
ఈ నేపథ్యంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి రెండేళ్లకోసారి సమీక్షించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మీ పాలసీ సరిపోదని భావించకూడదన్నారు. మీ కవరేజ్ మొత్తం పెంచుకోవడానికి టాప్ అప్ ప్లాన్ తీసుకోవాలన్నారు. మీకు కుటుంబం ఉంటే, అందరికీ సరిపోయే కవరేజ్ తీసుకోవాలని సూచించారు. నగరాల్లో ఒక సాధారణ శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి కనీసం రూ. 10-15 లక్షల కవరేజ్ ఎంచుకోవాలన్నారు నిపుణులు. ఉద్యోగం మారినప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ ఆగిపోతుంది. వ్యక్తిగత పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాల భద్రత ఉంటుంది.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి