Trump Crypto Strategic Reserves: ట్రంప్ ప్రకటన.. రూ.26 లక్షల కోట్ల మేర క్రిప్టో సంపద వృద్ధి
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:04 PM
ప్రముఖ క్రిప్టో కరెన్సీలతో వ్యూహాత్మక డిజిటల్ నగదు నిల్వలను ఏర్పాటు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించడం సంచలనానికి దారి తీసింది. క్రిప్టో కరెన్సీల విలువ ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేరకు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: సంచలనాలకు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక్క ప్రకటనతో క్రిప్టోమార్కెట్లలో జోష్ నింపారు. క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ ఊపందుకోవడంతో వాటి విలువ అమాంతం రూ.26 లక్ష కోట్ల మేర పెరిగింది. ఇప్పటివరకూ అమెరికా వద్ద ఉన్న వ్యూహాత్మక నగదు నిల్వలకు తోడుగా క్రిప్టో కరెన్సీ నిల్వలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ప్రకటన ప్రస్తుతం మార్కెట్‌లో పెను కలకలానికి దారి తీస్తోంది(Trump Crypto Strategic Reserves).
క్రిప్టో కరెన్సీలతో వ్యూహాత్మ డిజిటల్ నగదు నిల్వలను ఏర్పాటు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ తొలుత పేర్కొన్నారు. ఆ తరువాత గంటలోనే మరో విస్పష్టమైన ప్రకటను సోషల్ మీడియాలో వదిలారు. బిట్‌కాయన్, ఈథర్ తో పాట్ ఇతర కరెన్సీలతో ఈ నిల్వలు ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తానని కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో, క్రిప్టో మార్కెట్‌లో ఒక్కసారిగా జోష్ వచ్చేసింది.
Gold Crossing 1 lakh: ఈ సంవత్సరం బంగారం ధర లక్ష మార్కు దాటుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే
ప్రపంచంలో అత్యంత విలువైన క్రిప్టో కరెన్సీగా పేరుపడ్డ బిట్ కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా 11 శాతం మేర పెరిగి 94 వేల డాలర్లకు చేరుకుంది. ఇక రెండో అతిపెద్ద కరెన్సీ ఈథర్ మార్కెట్ విలువ కూడా 13 శాతం మేర పెరిగి 2,516 డాలర్లకు చేరుకుంది. మొత్తం క్రిప్టోకరెన్సీల విలువ కూడా పది శాతం మేర పెరిగి 300 బిలియన్ డాలర్లను దాటిపోయింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిపోవడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
క్రిప్టో మార్కెట్‌లో అధికారికంగా పాల్గొనేందుకు అమెరికా ప్రభుత్వం కూడా సిద్ధమవుతోందనేందుకు ఈ ప్రకటన ఓ సూచన అని అమెరికా మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీంతో, క్రిప్టోల నియంత్రణపై స్పష్టత, డిజిటల్ రంగంలో అమెరికా ఆధిపత్యం సుస్థిరమవుతుందని అంటున్నాయి. వ్యవస్థాగత స్థాయిలో క్రిప్టోల వినియోగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
అయితే, కొందరు ఫైనాన్స్ నిపుణులు మాత్రం ట్రంప్ ప్రకటనలో పలు లోపాలను ఎత్తి చూపారు. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోలను కూడా వ్యూహాత్మక నిల్వల ఏర్పాటు కోసం పరిగణలోకి తీసుకోవడం కొంత ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ‘‘బిట్‌కాయిన్ తప్ప మిగతా కరెన్సీలన్నీ టెక్ పెట్టుబడుల లాంటివి. వాటి ప్రాథమిక నాణ్యతను మరిచినట్టు కనిపిస్తోంది. ఈ ప్రకటనలో జాతీయత కూడా తొంగిచూస్తోంది’’ అని సదరు వర్గాలు కామెంట్ చేశాయి.
నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం: ఎలాన్ మస్క్
గత ఎన్నికల్లో ట్రంప్‌కు క్రిప్టో సంస్థలు కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే, దీంతో, అధ్యక్ష పీఠం ఎక్కగానే ట్రంప్ క్రిప్టో ప్రయోజనాల కోసం చర్యలు ప్రారంభించారు. శ్వేత సౌధం వేదికగా తొలి క్రిప్టో శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా ట్రంప్ కుటుంబసభ్యులు స్వయంగా కొన్ని క్రిప్టో కరెన్నీలను కూడా మార్కెట్‌లో విడుదల చేశారు. అయితే, బైడెన్ ప్రభుత్వం మాత్రం క్రిప్టో కరెన్సీలపై ఉక్కుపాదం మోపింది. డిజిటల్ మోసాల నుంచి సాధారణ అమెరికన్లను రక్షించేందుకు, నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పలు నియంత్రణ సంస్థలు క్రిప్టో సంస్థలపై కఠిన ఆంక్షలు విధించాయి. ఇక ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ క్రిప్టో సంస్థలపై వివిధ దశల్లో ఉన్న విచారణలను ఉపసంహరించుకుంది. కొన్నింటిపై ఉన్న కేసులను కూడా వెనక్కు తీసుకుంది.
మరిన్ని అంతర్జాతీయ, వాణిజ్య వార్తల కోసం క్లిక్ చేయండి