School Fees: దేశంలో స్కూల్ ఫీజుల పేరుతో దోపిడీ.. క్రిప్టోకరెన్సీ సహ వ్యవస్థాపకుడి పోస్ట్ వైరల్
ABN , Publish Date - Jul 13 , 2025 | 06:56 PM
ప్రస్తుతం భారతదేశంలో విద్యా ఖర్చులు పైపైకి వెళ్తున్నాయని CoinSwitch సహ వ్యవస్థాపకుడు ఆశిష్ సింఘాల్ అన్నారు. ప్రైవేటు స్కూల్స్ పెంచుతున్న ఫీజుల స్థాయి చూస్తుంటే, ఇది ఒక దోపిడీ మాదిరిగా అనిపిస్తోందన్నారు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

దేశంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయని CoinSwitch సహ వ్యవస్థాపకుడు ఆశిష్ సింఘాల్ తెలిపారు. బెంగళూరు వంటి నగరాల్లో CBSE స్కూళ్లలో మూడో తరగతి విద్యార్థులకే ఏడాదికి రూ. 2.1 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లలో వీటి ఫీజులు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. తన కుమార్తె కోసం పలు రకాల స్కూల్స్ వెళ్లి తెలుసుకున్నప్పుడు ఈ భారీ ఫీజుల గురించి తెలిసిందన్నారు.
ఈ ఫీజలు ఇంజనీరింగ్, డిగ్రీ వంటి ఉన్నత చదువుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ స్కూల్ ఫీజుల పెంపు, దోపిడీ కాకపోతే ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మధ్యతరగతి ఉద్యోగుల్లో జీతం పెరుగుదల గత 10 సంవత్సరాల్లో 0.4% ఉంటే, స్కూల్ ఫీజుల పెరుగుదల మాత్రం 10 నుంచి 30 శాతం వరకు ఉందన్నారు. దీంతో మొత్తం ఇంటి ఆదాయంలో విద్యా ఖర్చులు 19% అవుతున్నాయని చెప్పారు.
మరోవైపు అహ్మదాబాద్‌లో కూడా 4వ తరగతి విద్యార్థులకు సంవత్సర ఫీజు రూ.1.8 లక్షలుగా ఉందన్నారు. ఇలాంటి ఫీజులు ఉన్న క్రమంలో తల్లిదండ్రుల నుంచి నర్సరీకి ఫీజులు EMIలు రూపంలోనూ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ఈ విధానం తల్లిదండ్రుల ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి లేదా తమ పొదుపులను ఖర్చు చేయడానికి ఒత్తిడి చేస్తోందన్నారు. అద్దె, రవాణా, పుస్తకాలు, యూనిఫామ్‌ల వంటి ఖర్చులు కూడా ఈ భారాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. ఈ ఫీజు విధానాలు కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు. మధ్య తరగతి కుటుంబాల కలలను కూడా దెబ్బతీస్తున్నాయన్నారు. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఆకాంక్షతో తల్లిదండ్రులు ఆర్థిక ఒత్తిడిని భరిస్తున్నారని వెల్లడించారు.
అధికారిక డేటా ప్రకారం విద్యా ద్రవ్యోల్బణం 4% ఉన్నప్పటికీ, వాస్తవ ఫీజు పెంపు 10-30% మధ్య ఉంటోంది. కాలేజీ టైమ్ కోసం పొదుపు చేయడం మర్చిపోయి, ఇప్పుడు నర్సరీ కోసమే లోన్స్ తీసుకుంటున్నారని సింఘాల్ వ్యాఖ్యానించారు. దీనిని నిశ్శబ్ద ఒత్తిడని సింఘాల్ తన లింక్డ్‌ఇన్ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో ఫీజుల పరిస్థితిపై తీవ్రంగా ఆలోచించి, సమర్ధవంతమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి