Vastu Tips: ఇంట్లో నీటి కుండను ఏ దిశలో ఉంచితే అదృష్టం.. ఎక్కడ ఉంచకూడదు..
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:19 AM
Vastu Tips For Water Pots: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఈ దిశలో నీటి కుండను ఉంచితే అన్నీ శుభాలే కలుగుతాయి. సరైన దిశలో నీటి కుండను ఉంచడం వల్ల ఐశ్వర్యం, సుఖశాంతులు చేకూరుతాయి. అలాకాక తప్పుడు దిక్కులో ఏర్పాటు చేస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Vastu Tips For Water Pots: వాస్తు శాస్త్రంలో ప్రతి దిక్కుకు, మూలకూ ఒక ప్రత్యేక స్థానముంది. ఒక్కో దిశకు ఒక్కో దేవత అధిపతిగా ఉంటాడు. వీటి ఆధారంగా మన ఇంట్లో వస్తువులను ఏవి ఎక్కడ ఉంచాలో నిర్ణయించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తూనే ఉంటుందని నమ్ముతారు. మిగిలిన వస్తువుల మాదిరే ఆహారం, నీటి కోసం కూడా ఒక స్థలాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. వాస్తు నిపుణుల ప్రకారం నీటి కుండలను ఒక నిర్దిష్ట దిశలోనే ఏర్పాటు చేయాలి. ఇది పట్టించుకోకపోతే సానుకూల శక్తికి బదులుగా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించవచ్చు. కాబట్టి, నీటి కుండలను ఏ దిశలో ఉంచాలి.. ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో నీటి కుండను ఏ దిశలో ఉంచాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఈశాన్య మూలలో, ఉత్తరం లేదా తూర్పు వైపునే నీటితో నింపిన మట్టి పాత్రలను ఉంచాలి. ఈ దిశకు వరుణ దేవుడు అధిపతి. ఈశాన్య మూల బృహస్పతి గ్రహం దిశ. ఇక్కడ నీటి కుండను ఉంచితే వరుణుడి ఆశీస్సులు లభించింది అదృష్టం సిద్ధిస్తుందని భావిస్తారు. సానుకూల వాతావరణం, శాంతి నెలకొని విజయాలు చేకూరుతాయి. శక్తి, తేజస్సు పొంది కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో జీవిస్తారు.
ఇంట్లో నీటి కుండను ఏ దిశలో ఉంచకూడదు?
దక్షిణ దిశకు అగ్ని అధిపతి. అందువల్లే ఇక్కడ కుండ పెట్టడాన్ని అశుభమని భావిస్తారు. ఈ ప్రదేశంలో నీటి పాత్రను ఉంచితే ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీటి పాత్రను దక్షిణ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది, ఇది ఇంట్లోకి ప్రతికూలతను తెస్తుంది. అలాగే నైరుతి దిక్కులోనూ ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశ భూమి శక్తులచే పాలించబడుతుంది. కాబట్టి దక్షిణం, నైరుతి రెండూ నీటిని ఉంచేందుకు అనువైన ప్రదేశాలు కావు. ఇక్కడ నీటి కుండలను ఉంచితే శక్తుల అసమతుల్యత ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, అస్థిరత ఏర్పడవచ్చు. దక్షిణ లేదా నైరుతి అంత హానికరం కానప్పటికీ పశ్చిమ దిశలోనూ నీటి కుండను ఉంచకూడదు. ఎందుకంటే కుటుంబీకుల మధ్య భావోద్వేగాల అస్థిరత కలిగి కలహాలు వస్తాయి.