Share News

APPSC Sparks Controversy: ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:31 AM

గత ప్రభుత్వంలో వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన జేఎన్‌టీయూ-అనంతపురం మాజీ రిజిస్ర్టార్‌ సి.శశిధర్‌ను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ఆదివారం అర్ధరాత్రి సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

APPSC Sparks Controversy: ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని

సి.శశిధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

  • గత ప్రభుత్వంలో జేఎన్‌టీయూ-ఏ రిజిస్ర్టార్‌

  • అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు

  • వైసీపీ సర్కారుకు అనుకూలంగా భజన

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం

  • నియామకంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత

  • సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం దీనిపై ప్రభుత్వవర్గాల భిన్న స్పందన

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన జేఎన్‌టీయూ-అనంతపురం మాజీ రిజిస్ర్టార్‌ సి.శశిధర్‌ను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ఆదివారం అర్ధరాత్రి సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కీలకమైన పదవిలో శశిధర్‌ను అనూహ్యంగా నియమించడంతో టీడీపీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ‘రాజధానిగా అమరావతి పనికిరాదు. లక్షల కోట్లు ఖర్చు చేయడం వృథా. వైసీపీ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఉద్యోగులకు ఇంత మేలు చేయలేదు’ అని గత ప్రభుత్వంలో జేఎన్‌టీయూ-అనంతపురం రిజిస్ర్టార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలా పనిచేశారు. వైసీపీ అభ్యర్థికే ఓటు వేయాలని యూనివర్సిటీ ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. పట్టభద్రుల ఓట్ల కోసం జేఎన్‌టీయూ కాలేజీల్లో పర్యటించాలని ప్రస్తుత ఎమ్మెల్సీ, అప్పటి టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి ప్రయత్నించగా.. యూనివర్సిటీలోకి అడుగు పెడితే ఊరుకోనంటూ అడ్డుకున్నారు. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే చాలా బాధపడిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు కావడంతో గతేడాదే రిజిస్ర్టార్‌ పదవికి రాజీనామా చేశారు. ఇదంతా గతం. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు ఆయన ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు.


ఎలా నియమించారో?

సాధారణంగా ఏపీపీఎస్సీకి విద్యా రంగం, ఇతరత్రా రంగాలకు చెందిన నిష్ణాతులనే సభ్యులుగా నియమిస్తారు. కానీ చాలాకాలంగా ఏపీపీఎస్సీ సభ్యుల నియామకపు తీరు మారింది. వైసీపీ విద్యార్థి విభాగంలో పనిచేసిన సలాంబాబును గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ సభ్యుడ్ని చేసింది. వైఎస్‌ భారతి సిఫారసుతో నియామకం పొందిన మరో సభ్యుడు ఇంకా కమిషన్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ సానుభూతిపరులను నియమించడంలో వింతేమీ లేదు. కానీ విచిత్రంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ సానుభూతిపరుడినే కమిషన్‌ సభ్యుడిగా నియమించడం వివాదానికి దారితీసింది. సోమవారం ఉదయం నుంచే ఈ నియామకంపై టీడీపీ వర్గాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. వైసీపీకి అనుకూల ప్రొఫెసర్‌ను ఈ ప్రభుత్వంలో ఎలా నియమించారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. కీలకమైన కమిషన్‌లో ఒక సభ్యుడిని నియమించేటప్పుడు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నాయి. ఈ నియామకం ప్రభుత్వం, అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపేలా కనిపిస్తోంది.


అంతా వైసీపీ భజనే

శశిధర్‌ మొదట్నుంచీ వైసీపీ భజనపరుడిగానే గుర్తింపు పొందారు. అవకాశం దొరికినప్పుడల్లా గత వైసీపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తడం, టీడీపీ నిర్ణయాలను తప్పుబట్టడం పనిగా పెట్టుకునేవారు. ఉద్యోగులకు గత వైసీపీ ప్రభుత్వం హెల్త్‌ స్కీం ప్రవేశపెడితే అంత గొప్ప స్కీం ఎక్కడా లేదన్న స్థాయిలో అనుకూల భజన చేశారు. జేఎన్‌టీయూ-ఏకు గత ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ కేటాయిస్తే ఆహా ఓహో అద్భుతం అంటూ ప్రకటనలు జారీ చేశారు. పలు ప్రైవేటు వేదికల్లో మాజీ సీఎం జగన్‌తో కలిసి ఫొటోలు దిగారు. అప్పటి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి అనుచరుడిగా శశిధర్‌కు పేరుంది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిపై శశిధర్‌ విషం కక్కారు. ‘లక్షల కోట్లు వెచ్చించి నిర్మించేలా రాజధాని సరికాదు. ఒక సివిల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడిగా నేను అమరావతి ప్రాంతంలో పర్యటించాను. అక్కడ బేస్‌మెంట్‌కే ఎక్కువ ఖర్చు చేయాలి. అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి’ అని ప్రకటించారు. కాగా, శశిధర్‌పై వ్యక్తమవుతున్న అభ్యంతరాలను ప్రభుత్వవర్గాలు తోసిపుచ్చాయి. అమరావతి సహా పలు అంశాలపై తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని అప్పట్లోనే ఆయన ఖండించినట్టు గుర్తు చేశాయి.


హోదా కూడా తెలియదా?

శశిధర్‌ను నియమించడం వెనుక ఎలాంటి కసరత్తు చేయలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆదివారం అర్ధరాత్రి జీవో జారీ చేసినట్లు చూపించినా సోమవారం జీవో కాపీని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆయన హోదాను ‘ప్రొఫెసర్‌ అండ్‌ రిజిస్ర్టార్‌ జేఎన్‌టీయూ-అనంతపురం’గా సాధారణ పరిపాలన శాఖ జీవోలో పేర్కొంది. కానీ ఆయన గతేడాదే రిజిస్ర్టార్‌ పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారంటే ఎలాంటి పరిశీలన చేయలేదని తెలుస్తోంది.

Updated Date - Jun 24 , 2025 | 04:31 AM