Share News

YSRCP Leaders: వైసీపీ నేతల క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:28 AM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టు రట్టయింది. వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ, యడ్ల నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు

YSRCP Leaders: వైసీపీ నేతల క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు

  • పరారీలో నిందితులు.. పాలకొల్లు పోలీసుల గాలింపు

పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గుట్టు రట్టయింది. హైదరాబాద్‌, విశాఖ కేంద్రాలుగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బెట్టింగ్‌ నిర్వాహకులైన వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ, యడ్ల నాగేశ్వరరావు పరారీలో ఉన్నట్టు నరసాపురం డీఎస్పీ డాక్టర్‌ శ్రీవేద తెలిపారు. వీరు పదేళ్లుగా ఈ బెట్టింగ్‌ నడుపుతున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్టు తెలిపారు. ఆదివారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్‌ రోడ్డు వద్ద గురుకుల పాఠశాల సమీపంలో టీ-జంక్షన్‌ వద్ద ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎన్‌. వెంకట్రావు, వై.వెంకట మురళీ కృష్ణను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన సాయి, కోటి, సఖినేటిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం, రాజోలుకు చెందిన హనుమ, మలికిపురానికి చెందిన శ్రీనుతోపాటు ఇంకా పలువురు ఉన్నట్టు సమాచారం ఉందని వారిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు.


నిందితుల నుంచి 2 ల్యాప్‌టా్‌పలు, 10 మొబైల్‌ ఫోన్లు, రూ.33 వేల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా వైసీపీ నాయకుడు యడ్ల తాతాజీ ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్టు సూత్రధారిగా వెల్లడి కావడం పట్టణంలో సంచలనమైంది. తాతాజీ పది రోజులుగా పరారీలోనే ఉండగా, ఆయన ఫోన్లు సైతం స్విచ్‌ ఆఫ్‌లో ఉన్నాయి.

Updated Date - Apr 21 , 2025 | 03:30 AM