Share News

Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:13 AM

ఎస్కార్ట్‌ పోలీసులపై దాడి కేసులో వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరైంది. శనివారం마다 పోలీసు స్టేషన్లో హాజరు కావాలని కోర్టు షరతు విధించింది.

Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్‌

  • ఆయన అనుచరులకు కూడా..

గుంటూరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపైన, ఎస్కార్ట్‌ పోలీసులపైనా దాడికి పాల్పడిన కేసులో నిందితులైన వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు, ఆయన అనుచరులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 10న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో కిరణ్‌పై, పోలీసు కార్యాలయంలో పోలీసులపై మాధవ్‌, ఆయన ఐదుగురు అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీనిపై అదే రోజు నగరంపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడమే గాక వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడంతో ఆరుగురినీ రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. కోర్టు ఆదేశాలతో ఈ నెల 23న మాధవ్‌ను పోలీసులు రెండ్రోజులు కస్టడీకి తీసుకున్నారు. 24న విచారణ ముగిశాక తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మాధవ్‌ తరపు న్యాయవాదులు కూడా బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఇరువర్గాల వాదనల అనంతరం సోమవారం గోరంట్ల మాధవ్‌, ఆయన అనుచరులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతి శనివారం పోలీసు స్టేషన్లో హాజరై రిజిస్టర్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. పూచీకత్తులు సమర్పించిన అనంతరం మంగళవారం వారు రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - Apr 29 , 2025 | 06:14 AM