Share News

Chittoor: అంగన్వాడీ కార్యకర్తపై కత్తులతో దాడి

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:07 AM

వైసీపీ అధికారాన్ని కోల్పోయాక కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుప్పం మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు అక్తర్‌, తన తమ్ముడు అంజాద్‌తో కలిసి అంగన్వాడీ కార్యకర్త నజియా బేగంపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

Chittoor: అంగన్వాడీ కార్యకర్తపై కత్తులతో దాడి

  • కుప్పంలో వైసీపీ నేతల అరాచకం

  • బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించిన టీడీపీ నేతలు

కుప్పం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారాన్ని కోల్పోయాక కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుప్పం మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు అక్తర్‌, తన తమ్ముడు అంజాద్‌తో కలిసి అంగన్వాడీ కార్యకర్త నజియా బేగంపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామంలో బుధవారం జరిగిందీ దారుణం. బాధితురాలి కథనం మేరకు.. రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన నజియా బేగం, అదే గ్రామంలో సుమారు 15 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులు మొదటినుంచీ టీడీపీకి మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. ఈ నెపంతో అదే గ్రామానికి చెందిన అక్తర్‌.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నజియా బేగంను ఉద్యోగం నుంచి తొలగించడానికి పలుమార్లు ప్రయత్నించాడు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించాడు. ఎమ్మెల్సీ భరత్‌ దగ్గరకు తీసుకెళ్లి వార్నింగ్‌ ఇప్పించాడు. అయితే, తప్పు చేయనప్పుడు తానెందుకు రాజీనామా చేయాలని ఆమె ఎదురు తిరిగారు. దీంతో అక్తర్‌, అంజాద్‌ తదితర వైసీపీ నేతలు తరచూ ఆమెపై దౌర్జన్యానికి దిగేవారు.


టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆ సోదరుల ఆగడాలు ఆగలేదు. బుధవారం తన ఇంటిముందు పంచాయతీ కుళాయి వద్ద నజియా బేగం తాగునీరు పట్టుకుంటుండగా అక్తర్‌ అక్కడికి వచ్చి పైపు లైన్‌ గేటు వాల్వ్‌ను విరగ్గొట్టి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో నజియా బేగంపై అక్తర్‌ దాడికి పాల్పడ్డాడు. తమ్ముడు అంజాద్‌తో కలిసి కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ నజియా బేగంను కుటుంబ సభ్యులు కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్‌ కుమార్‌, పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ తదితరులు ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తపై దాడిని ఖండించారు. రౌడీషీటర్లు కూడా అయిన అక్తర్‌, ఆయన సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుప్పం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 19 , 2025 | 05:07 AM