Share News

AP Government: అతివకు కోరినంత రుణం

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:00 AM

స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించారు. 2025 నుండి 2026 మార్చి వరకు 88 లక్షల మంది సభ్యులకు 61,964 కోట్లు రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు

AP Government: అతివకు కోరినంత రుణం

  • వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన

  • క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా తయారు

  • స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక ఊతం

  • ఎన్యుమరేటర్లుగా 1.25 లక్షల మంది సభ్యులకు శిక్షణ

  • మొత్తం 88,48,109 మంది సభ్యులకు 61,964 కోట్లు

  • 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు అందజేత

  • అత్యధికంగా వ్యవసాయ రంగంలో రూ.11,319 కోట్లు

  • అప్పుతో పాటు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందజేత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ బృందాల్లోని సభ్యులకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది. డ్వాక్రా మహిళల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఈసారి రుణ ప్రణాళికను వినూత్నంగా రూపొందిస్తున్నారు. గతంలో ఉన్నత స్థాయిలో లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు రుణ ప్రణాళిక తయారు చేసేవారు. తాజాగా సెర్ప్‌ సీఈవోగా కరుణ వాకాటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని దాదాపు 89 లక్షల మంది డ్వాక్రా మహిళల క్షేత్రస్థాయి అవసరాలను రుణ ప్రణాళిక ప్రతిబింబించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంఘాల నుంచి 1.25 లక్షల మంది విద్యావంతులైన సభ్యులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి రుణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా వారికి ఆర్థిక వ్యవహారాలు, డిజిటల్‌ లిటరసీపై ప్రత్యేక శిక్షణ అందించారు. గత రెండు వారాలుగా ఒక్కో ఎన్యుమరేటర్‌ నాలుగైదు గ్రూపులను సంప్రదించారు. వాటిలోని సభ్యుల వృత్తి పరమైన సమాచారం, వారి కుటుంబ సభ్యుల ఆదాయ వ్యయాలు, తదితర వివరాలను యాప్‌ ద్వారా సేకరించారు. అలాగే వారు పొందిన రుణాలు, ఇంకా చెల్లించాల్సిన అప్పు ఎంత, వారి కుటుంబాల్లో ఆర్థిక అవసరాలు, జీవనోపాధి పెంపునకు స్వయం ఉపాధి యూనిట్లకు ఎంత రుణం అవసరం వంటి వివరాలు కూడా సేకరించి వార్షిక, ఆర్థిక జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళిక 2025-26 యాప్‌లో పొందుపరిచారు. వీటిని ప్రామాణికంగా తీసుకొని రుణ ప్రణాళికను తయారు చేస్తున్నారు. సరైన వనోపాధులపై పెట్టుబడులు పెట్టడం ద్వారా మహిళల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బ్యాంకు రుణాల ద్వారా సభ్యుల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు వారి పిల్లలకు మంచి విద్య, వైద్యం తదితర సౌకర్యాలు అందుతాయి. దీంతో ఈ బృందాల సభ్యులకు రుణ నిర్వహణ, సకాలంలో చెల్లింపులు, రుణ ప్రణాళికపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, పశుసంవర్థక, చేనేత శాఖలతో అనుసంధానం చేసుకోవడం ద్వారా సుస్థిర జీవనోపాధి సాధించగలుగుతారు. అలాగే స్వయం సహాయక బృందాలు, ఆర్థిక సంస్థల మధ్య విశ్వాసం పెరిగి రుణాలు విరివిగా పొందే అవకాశం ఉంటుంది.


రంగాల వారీగా...: రాష్ట్రంలోని మొత్తం 88,48,109 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.61,964 కోట్ల రుణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి 12,28,781 మంది సభ్యులకు రూ.11,319 కోట్లు, ఏఎస్ఆర్లో 39,635 మందికి రూ.415 కోట్లు, ఉద్యాన పంటల విభాగంలో 23,891 మందికి రూ.231 కోట్లు, పశుసంపదకు సంబంధించి 4,09,312 మందికి రూ.4,140 కోట్లు, తయారీ రంగంలో 39,177 మందికి రూ.438 కోట్లు, సెరికల్చర్‌లో 2,867 మందికి రూ.35కోట్లు, సేవారంగానికి సంబంధించి 2,52,621 మందికి రూ.2,638 కోట్లు, వాణిజ్య రంగంలో 2,44,772 మందికి రూ.2,797 కోట్లు, కుటుంబ నిత్యావసరాల కోసం 16,09,217 మందికి రూ.6,914 కోట్లు, వివాహం/విద్యకు 13,68,314 మందికి రూ.8,951 కోట్లు, ఆస్తుల కొనుగోలు కోసం 9,39,206 మందికి రూ.6,950 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి 10,68,217 మందికి రూ.9,952 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి 16,22,099 మందికి రూ.7,178 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు ఏ నెలలో, ఎంతమంది సభ్యులకు, ఎంత మొత్తం రుణంగా అందించాలన్న దానిపైనా కసరత్తు చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, సీఐఎఫ్‌, స్త్రీనిధి తదితర రుణాలపై సెర్ప్‌ సిబ్బందికి నెలవారీ లక్ష్యాలను నిర్దేశిస్తారు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది.


వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, మినీ రైస్‌ మిల్లులు, తృణధాన్యాల ఆధారిత పరిశ్రమలు, తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు. వీటిని ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్, తిరుపతి, కడప, ప్రకాశం, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తారు. వీటిని ఎంచుకున్న సంఘాల సభ్యులకు వైజాగ్‌, కడపలో శిక్షణ అందించనున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, ఏఎస్ఆర్,మన్యం, విజయనగరం, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో వెదురు సాగును ప్రోత్సహిస్తారు. దీన్ని వెయ్యి మంది మహిళలు ఎంచుకున్నారు. ప్రకాశం, సత్యసాయి, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో షేడ్‌ నెట్‌ వ్యవసాయం చేపట్టనున్నారు. తేనె ఆధారిత వ్యాపారాలను విజయనగరం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో వెయ్యి మంది చేపడతారు. చేపల కుంటలు, రొయ్యల పెంపకం, చేనేత, టూరిజం తదితర రంగాల్లో కూడా సభ్యులకు శిక్షణ అందిస్తారు. ఏయే జిల్లాలో, ఏ పరిశ్రమలు, ఎంతమంది సభ్యులు ఎంచుకున్నారో ఎన్యుమరేటర్ల ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించారు.

Updated Date - Apr 28 , 2025 | 05:05 AM