Tirupati: నన్ను టార్గెట్ చేసి నిర్బంధించారు
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:09 PM
శేషాచల అడవుల్లోని ప్రకృతి అందాలను బాహ్యప్రపంచానికి వెబ్‌పేజీ ద్వారా చూపుతున్న తనను టార్గెట్ చేసి పుత్తూరు అటవీశాఖ కార్యాలయంలో అక్రమంగా నిర్బంధించారని వైల్డ్‌లైఫ్ అండ్ మాక్రో ఫొటోగ్రాఫర్ సిద్థార్థ ఆరోపించారు.

- వైల్డ్‌లైఫ్ అండ్ మాక్రో ఫొటోగ్రాఫర్ సిద్ధార్థ
తిరుపతి: శేషాచల అడవుల్లోని ప్రకృతి అందాలను బాహ్యప్రపంచానికి వెబ్‌పేజీ ద్వారా చూపుతున్న తనను టార్గెట్ చేసి పుత్తూరు అటవీశాఖ కార్యాలయంలో అక్రమంగా నిర్బంధించారని వైల్డ్‌లైఫ్ అండ్ మాక్రో ఫొటోగ్రాఫర్ సిద్థార్థ(Siddharth) ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీశాఖ నిబంధనల ప్రకారం సదాశివకోన, జలపాతాలను, దేవాలయాలను సందర్శించాలని 20 మంది స్నేహితులతో కలిసి అటవీశాఖ టిక్కెట్లను కొని ఆదివారం వెళ్లామన్నారు.
తిరుగు ప్రయాణంలో తమకు అనుమతిచ్చింది ఈ ప్రదేశం వరకే అంటూ పుత్తూరు అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లి రాత్రంతా గదిలో పెట్టి తాళంవేశారన్నారు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నించినా పొంతనలేని సమాధానం చెప్పారన్నారు. సోమవారం ఉదయం 10గంటలకు ప్రాంతంలో తమ వద్ద హామీ పత్రాన్ని రాయించుకుని వదిలి పెట్టారన్నారు. తనను అరెస్టు చేసినట్లు, అపరాధ రుసుం కట్టించుకున్నారని జిల్లా అటవీశాఖ అధికారి వివేక్ చెప్పినట్లుగా సామాజిక మాధ్యమంలో చూశానన్నారు.
దివ్యారామంలో చెట్లు నరికిన అంశంపై తాను చేసిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారడంతోనే ఇలా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 9 ఏళ్లుగా ప్రకృతి అందాలను చిత్రీకరించి బాహ్య ప్రపంచానికి చూపుతున్న తనకు, ఒక రాత్రిలో పరువు పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News