Rayachur Incident: సెల్ఫీ దిగుదామని చెప్పి..భర్తను కృష్ణా నదిలో తోసిన భార్య
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:44 AM
కర్ణాటకలోని దేవసూగూరు గ్రామానికి చెందిన తాతయ్యకు రెండు నెలల క్రితం లింగసూగూరుకు చెందిన సుమంగళతో వివాహమైంది...

బ్రిడ్జి నుంచి పడి వరదలో కొట్టుకెళ్లిన బాధితుడు
రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న వైనం
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఘటన
కృష్ణ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని దేవసూగూరు గ్రామానికి చెందిన తాతయ్యకు రెండు నెలల క్రితం లింగసూగూరుకు చెందిన సుమంగళతో వివాహమైంది. దంపతులు ద్విచక్ర వాహనంపై లింగసూగూరు నుంచి శనివారం ఉదయం దేవసూగూరు గ్రామానికి బయలుదేరాడు. రాయచూర్ జిల్లా కడలూరు గ్రామ శివారులోని కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ రోడ్ కం బ్యారేజ్ వద్దకు రాగానే సెల్ఫీ దిగుదామని సుమంగళ కోరింది. దీంతో బైక్ ఆపి సెల్ఫీ దిగుతుండగా భర్తను నదిలోకి తోసింది. ఉధృతంగా పారుతున్న నీటిలో కొట్టుకుపోయిన తాతయ్యకు అదృష్టవశాత్తు నదిలో పెద్ద బండరాళ్లు కనిపించాయి. దీంతో అతను అటువైపు ఈదుతూ వెళ్లి ఆ రాళ్లపై నిలబడి సహాయం కోసం కేకలు వేశాడు. దీంతో బ్రిడ్జిపై వెళుతున్న యువకులు అతన్ని గమనించారు. సుమారు 100 మీటర్ల దూరంలో నది మధ్యలో రాళ్లపై ఉన్న తాతయ్యకు అందేలా బ్రిడ్జిపై నుంచి తాడు వేశారు. ఆ తాడును అతను నడుముకు కట్టుకోగా.. యువకులు బ్రిడ్జి పైకి లాగి రక్షించారు. సెల్ఫీ పేరిట భార్య చేసిన అఘాయిత్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సెల్ఫీ దిగుదామని అనడంతో..భార్య తనను చంపడానికి సిద్ధంగా ఉందని అప్పటికే అనుమానం వచ్చిందని తాతయ్య ఆవేదన వ్యక్తంచేశాడు. ఆమె మాత్రం ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని చెబుతోంది. ఈ ఘటన అనంతరం దంపతులు బైక్‌పై దేవసూగూరుకు వెళ్లిపోయారు.