CM Chandrababu: గంజాయి డ్రగ్స్‌పై ఇక యుద్ధమే
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:18 AM
కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు యుద్ధం ప్రకటించారు.

రాజకీయ ముసుగులో ముఠాలకు సహకరిస్తే
ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు: సీఎం
హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఎలా గుర్తుకొస్తుందో ఇప్పుడు అమరావతి అంటే క్వాంటమ్, జీనోం, ఏఐ గుర్తుకొస్తాయి. విజన్-2047లో భాగంగా తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్ 1గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. -చంద్రబాబు
మారండి.. లేదంటే రాష్ట్రం వదిలిపోండి
ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా
జగన్ జమానాలో గంజాయిలో ఏపీ నం.1
నాడు 11 వేల ఎకరాల్లో సాగు.. నేడు జీరో
గూగుల్, శాటిలైట్, డ్రోన్స్‌తో కన్నేశాం
ప్రజా చైతన్యంతోనే గంజాయి, డ్రగ్స్ కట్టడి
వాటిని నియంత్రించకుంటే జాతి నిర్వీర్యం
గుంటూరు సభలో చంద్రబాబు స్పష్టీకరణ
టోల్ ఫ్రీ నంబరు 1972కు శ్రీకారం వాట్సాప్ నంబరు 8977781972 కూడా
గుంటూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. రాష్ర్టానికి, సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన వీటిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు.
రాజకీయ ముసుగులో ఎవరైనా గంజాయి ముఠాలకు సహకరిస్తే వారినెలా అదుపు చేయాలో, ప్రజలను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసన్నారు. జగన్ జమానాలో కిళ్లీ బంకుల్లో, కిరాణా షాపుల్లోనూ నిత్యావసర వస్తువు మాదిరిగా గంజాయి లభ్యమైందని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరులో జరిగిన అవగాహన సభలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి పండించే వ్యక్తులు, అక్రమ రవాణా చేసేవారు, వాటికి బానిసలైన అందరిపైనా యుద్ధం ప్రకటిస్తున్నానన్నారు. అటువంటి వారు ఇకనైనా మారాలని, లేదంటే రాష్ట్రం వదిలి వెళ్లాలని, వారికి ఇక్కడ ఉండే అర్హతే లేదని స్పష్టంచేశారు. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, గంజాయిని నియంత్రించకపోతే జాతి నిర్వీర్యమవుతుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దేశంలోనే ఏపీని గంజాయి సాగులో నంబర్‌వన్‌గా చేశారని.. విశాఖ కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతంలో 11 వేల ఎకరాల్లో సాగు చేసి దేశమంతా పంపిణీ చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని జీరో శాతానికి తీసుకొచ్చామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా ‘ఈగల్’ విభాగాన్ని ఏర్పాటు చేశామని.. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.
‘గూగుల్, శాటిలైట్, డ్రోన్స్ వినియోగించి గంజాయి సాగును పూర్తిగా తుడిచివేశాం. ఇప్పటికే డ్రోన్స్‌తో పెట్రోలింగ్, సీసీ కెమెరాలతో రియల్ టైంలో శాంతి భద్రతలు కాపాడే చర్యలు చేపట్టాం’ అని తెలిపారు. వీటి నియంత్రణకు ప్రజా చైతన్యం అవసరమని, తమ పోరాటంలో జనం కూడా భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు. ‘టోల్ ఫ్రీ నంబరు 1972ని ప్రారంభిస్తున్నాం. మీ ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తుంటే.. ఈ నంబరుకు ఫోన్ చేసి సమాచారమిస్తే సరిపోతుంది. మీ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. టోల్ ప్రీ నంబరుతో పాటు వాట్సాప్ నంబరు 8977781972ను కూడా ఆయన ప్రారంభించారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు సెలెబ్రిటీలు కూడా ముందుకు రావాలన్నారు. ‘గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైన వారిని కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా 56 డీ-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. వాటితోపాటు మరో మూడు ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన డీ-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించారు.
రౌడీ షీటర్లకు పరామర్శలా?
రాజకీయాల్లో ఉండేవారు ఆదర్శంగా ఉండాలే కానీ చెడును ప్రోత్సహించకూడదని సీఎం అన్నారు. ‘తెనాలిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్.. పోలీసులపైనే దాడిచేస్తే.. వారిని అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తే.. వందల వాహనాలతో వెళ్లి వారిని పరామర్శించడమా...? అటువంటి వారిని ఏం చేయాలి..? వదిలిపెట్టమంటారా...?’ అని సభికులను ఆయన ప్రశ్నించగా.. వద్దు వద్దంటూ వారు నినాదాలు చేశారు. తెలిసో తెలియకో ఒకసారి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం విచ్ఛిన్నమవుతుందని సీఎం హెచ్చరించారు. ‘వాటికి అలవాటు పడితే నిస్సత్తువగా మారి ఏకాగ్రత కోల్పోయి, మనిషి మృగంగా మారతాడు. చివరకు ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. మత్తుకు బానిసలైన వారు తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులపైనా, చివరకు పసిపిల్లలపై సైతం దాడులకు తెగబడుతున్నారు.
ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజు. శాశ్వతంగా వారిమత్తు ఎలా వదిలించాలో నాకు తెలుసు. ఇతర రాష్ర్టాల నుంచి 34 లక్షల మంది వలస కూలీలు రాష్ర్టానికి వస్తున్నారు. వెంట గంజాయి, డ్రగ్స్‌ను తీసుకొస్తున్నారు. వలస కూలీలతో పనులు చేయించుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దడంలో వారు కూడా బాధ్యత తీసుకోవాలి. జీరో డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ సహకరిస్తే.. రాష్ట్రంలో 100 శాతం శాంతిభద్రతలను కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. ఈగల్ ద్వారా వీటిని సమూలంగా కట్టడి చేస్తుంటే కొత్తగా మందుల దుకాణాల్లో మత్తు పదార్దాలు అమ్ముతున్నారు. ఇటువంటి వాటిపై డేగకన్ను వేశాం. విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతిల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఈగల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4,786 పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు అనిత, గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
మూలధన వ్యయానికి ప్రాధాన్యం
అమరావతి: మూలధన వ్యయం మరింత పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. కేంద్రం వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని అధికారులకు చెప్పారు.
గంజాయి ముఠాలపై కేసులు పెట్టకుంటే వారు ఇష్టానుసారం తయారవుతారు. సాగు, అక్రమ రవాణా దారుల ఆస్తులను సీజ్ చేస్తున్నాం. ఇప్పటికే విశాఖ ఏజెన్సీ పరిధిలో రూ.7 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశాం. ఆ సొమ్మును గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఉపయోగిస్తాం.
- సీఎం చంద్రబాబు