Visakha Mayor: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:40 AM
Visakha Mayor: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి దక్కించుకుంది. మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూమటి విజయం సాధించింది.

విశాఖపట్నం, ఏప్రిల్ 19: విశాఖ జీవీఎంసీ మేయర్ (Visakha GVMC Mayor) గొలగాని హరి వెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరుకావడంతో అవిశ్వాసం నెగ్గారు. ఈరోజు (శనివారం) ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమవగా.. హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. అయితే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ముందున్న 74 మెజార్టీలో ఆఖరి నిమిషంలో ఒకరు జారుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి కూతురు ప్రియాంక చేరికతో విజయం సొంతమైంది. 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓటింగ్‌తో కూటమి విజయం సాధించింది. ఇక కూటమి నుంచి మేయర్ అభ్యర్థి రేసులో పిలా శ్రీనివాస్ ఉన్నారు.
విశాఖ మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో ఈరోజు జీవీఎంసీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలన్న కూటమి నేతల ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. 74 సభ్యుల కూటమి బలంతో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గారు. నాలుగేళ్ల క్రితం జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58 వార్డులను గెలుచుకుంది. దీంతో 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఒక్కరు కూడా వైసీపీలో చేరారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది టీడీపీ, జనసేన గూటికి చేరిపోయారు. 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, 9 మంది జనసేనలోకి వెళ్లారు. అలాగే ఇండిపెండెంట్‌లు కూడా టీడీపీ, జనసేన పార్టీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ 58 మంది కార్పొరేటర్ల సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్‌చార్జ్, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. సంతకాల ధృవీకరణ కూడా జరిగిపోయింది.
ఈరోజు అవిశ్వాస తీర్మానంపై కోసం ప్రత్యేకంగా కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ దిశగా వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తమ వైపుకు లాక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంతే కాకుండా వారికి భారీగా నజరానాలు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు అంతా కూడా మలేషియాలోనే ఉన్నారు. అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈరోజు జరిగిన జీవీఎంసీ ప్రత్యేక సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో మేయర్‌పై పెట్టి అవిశ్వాస తీర్మానంపై కూటమి విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత
Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News