Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:46 PM
వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

విశాఖపట్నం: సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా రానున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాలను పట్టించుకోలేదని, చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవం ఏర్పాట్లపై ముగ్గురు మంత్రులు, అధికారులతో మంత్రి ఆనం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. " ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తాం.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలోని దేవాలయాలకు వచ్చే భక్తులు 30 శాతం పెరిగారు. చాలా వాటిని రాష్ట్ర పండగలుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో చాలా తప్పిదాలు జరిగాయి. ఆలయాల అంతరాలయంలోకి వెళ్లి మరీ కొంతమంది వీడియోలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా అంతరాలయంలో వీడియోలు తీయటం చాలా అరిష్టం. ఇలాంటి చేష్టలు వైసీపీ వాళ్లకే చెల్లుతాయి. ఈసారి చందనోత్సవంలో స్వామివారి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు అనుమతించడం లేదని" చెప్పారు.
కాగా, ఈ సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోపాటు హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు, దేవదాయశాఖ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న