Makar Sankranti: పక్షం రోజుల పాటు పండుగే
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:40 PM
మన్యంలోని గిరిజనుల ఆచార, వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. సంక్రాంతి పండుగను మూడు రోజులు నిర్వహించుకోవడం సహజం. కానీ మన్యంలో అందుకు భిన్నంగా ఈ పండుగను పక్షం రోజులు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

మన్యంలో విభిన్నం.. వైభవంగా సంక్రాంతి సంబరాలు
28వ తేదీతో ముగియనున్న సందడి
బంధువులు, స్నేహితుల రాకపోకలతో గిరిజన పల్లెల్లో హడావిడి
(పాడేరు- ఆంధ్రజ్యోతి): మన్యంలోని గిరిజనుల ఆచార, వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. సంక్రాంతి పండుగను మూడు రోజులు నిర్వహించుకోవడం సహజం. కానీ మన్యంలో అందుకు భిన్నంగా ఈ పండుగను పక్షం రోజులు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు రెండు వారాలను గిరిజనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీంతో పుష్యమాసాంతంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఎక్కడో చోట సంక్రాంతి పండుగను గిరిజనులు నిర్వహించుకుంటారు. ఈ పండుగ నిర్వహణ ఇతరులకు భిన్నంగానే ఉంటుంది.
మైదాన ప్రాంతాల్లో తీర్థాలు, పరసలు మాదిరిగా గిరిజన ప్రాంతంలో జనవరి నెలలో గిరిజనులు బారీజం పేరిట ప్రతి మూడేళ్లకు లేదా ఐదేళ్లకు ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు. దాదాపుగా సంక్రాంతి పండుగను తలపించేలా ఉన్నప్పటికీ కేవలం ఒక రోజు మాత్రమే బారీజాన్ని నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి మూడు లేదా ఐదేళ్లకు ఒకమారు జరుపుతారు. ఇందులో భాగంగా ఊరంతా ఒకే చోటకు చేరుకుని, సంప్రదాయబద్ధంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు, సహపంక్తి భోజనాలు, తర్వాత వివిధ రకాల వేషధారణలతో గ్రామంలోనే ప్రదర్శనలు, థింసా నృత్యాలు, డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. ప్రస్తుతం మన్యంలో బారీజనం వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం పాడేరు మండలం లింగాపుట్టులో బారీజం జరగ్గా, ఏజెన్సీ వ్యాప్తంగా వివిధ పల్లెల్లో సంక్రాంతి జరుగుతున్నది.
పుష్యమాసంతంలో గిరి పల్లెల్లో సందడి
గిరిజనులు సంప్రదాయం ప్రకారం పుష్యమాసం రెండో వారం ప్రారంభం(అంటే ఈ నెల 14 నుంచి 28 వరకు) పక్షం రోజులు సంక్రాంతి పండుగను నిర్వహిస్తారు. దీనిని స్థానిక భాషలో ‘పుష్య పోరోబ్’ అంటారు. దీంతో ఈ పక్షం రోజులు గిరిజన పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లోని వారి బంధువులు, స్నేహితులను తమ గ్రామాలకు ఆహ్వానించుకుంటారు. వారికి మద్యం, మాంసంతో భోజనాలు పెడతారు. అలాగే కొత్త దుస్తులు కొనిస్తారు. గిరిజనులు పక్షం రోజులు అటూ ఇటూ ‘పండుగ చుట్టాలు’గా రాకపోకలు సాగిస్తారు. ఒక్కో ప్రాంతం గిరిజనులు ఒక్కో వారం చొప్పున పదిహేను రోజులు చుట్టాల రాకపోకలు కొనసాగుతాయి. అలాగే పుష్యమాసం ముగిసే వరకు ప్రతి రోజు రాత్రిళ్లు మహిళలు థింసా నృత్యాలు, పురుషులు డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. అలాగే పురుషులు మాత్రమే వివిధ వేషధారణలతో గ్రామాల్లో తిరుగుతారు. దీంతో పుష్యమాసంలోనే ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి. పండుగకు అవసరమైన కొత్త కుండలు, డప్పులు, దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. పండుగ సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారపు సంతలకు వచ్చేటప్పుడే, తమ వారికి పండుగ కబుర్లు చెబుతుంటారు. వారపు సంతలకు సైతం కుటుంబ సమేతంగా వెళుతుంటారు. దీంతో ప్రతి ఏడాది పుష్యమాసం రెండో పక్షంలో మన్యంలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంటుంది.
తొలి రోజే భోగి పండుగ
ఇతర ప్రాంతాల్లో వలే ఏజెన్సీలో సంక్రాంతి పండుగ తొలి రోజునే గిరిజనులు సైతం భోగి పండుగను నిర్వహించారు. పండుగలో భాగంగా గ్రామంలోని పాత వస్తువులు, చీపుర్లు, తదితర కర్రలను భోగి మంటలో వేశారు. అలాగే భోగి మంట వద్దే నీళ్లను కాచుకుని, వాటితో స్నానమాచరించి కొత్త దుస్తులు వేసుకున్నారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచారు. భోగి రోజు నుంచి ప్రతి రోజు రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలతో పల్లెల్లో సందడి నెలకొంది.
సంక్రాంతి రోజున వ్యవసాయ పని ముట్లకు పూజలు
పుడమిపై ఆధారపడి వ్యవసాయంతో జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పని ముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి నిర్వహించుకుని, తమ పని ముట్లకు పూజలు చేశారు. సంక్రాంతి రోజున పెద్దగా సందడి వాతావర ణం ఉండదు. ఆ రోజు కూడా బియ్యం, పప్పులు కలిపి పులగం చేసుకుని అందరూ ఆరగించారు.
ఆఖరి రోజున పప్పల(పశువుల) పండుగ
మైదాన ప్రాంతంలో కనుమగా నిర్వహించే మూడో రోజును ఏజెన్సీలో పప్పల(పశువుల) పండుగ అంటారు. ఈ పండుగను కేవలం పశువుల కోసమే నిర్వహిస్తారు. తమ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతున్న మూగ జీవాలను మంచిగా చూసుకోవాలనే ఆలోచన రేకెత్తించేందుకే దీనిని నిర్వహిస్తామని గిరిజనులు అంటున్నారు. పప్పల పండుగ రోజున తమ పశువులను శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు రాశారు. అలాగే అరిసెలు, బూరెలు, గారెలతో దండను తయారు చేసి వాటి మెడలో వేశారు. ప్రత్యేకంగా పులగాలను వండి వాటికి ఆహారంగా పెట్టారు. పశువుల మెడలో ఉన్న పప్పల దండలను లాక్కుని తినేందుకు గ్రామాల్లోని యువకులు ఎంతో ఉత్సాహంగా వాటిపైకి ఎగబడ్డారు. పప్పల పండుగతో సంక్రాంతి పండుగ ముగిసింది.