Share News

Balasa Harsha: సత్తా చాటిన తెలుగు కుర్రాడు.. అంతర్జాతీయ సంస్థలో ఏకంగా రూ.50 లక్షలతో జాబ్..

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:24 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని కళాశాలలో చేరిన మెుదటి సంవత్సరం నుంచే బలంగా కోరుకున్నట్లు బలస హర్ష తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరినప్పుడు తనకు కోడింగ్‌పై అవగాహన లేదని, ఆ తర్వాత ప్రిన్సిపల్ చొరవతో నేర్చుకున్నట్లు చెప్పాడు.

Balasa Harsha: సత్తా చాటిన తెలుగు కుర్రాడు.. అంతర్జాతీయ సంస్థలో ఏకంగా రూ.50 లక్షలతో జాబ్..
Balasa Harsha Success Story

విశాఖ: విశాఖకు చెందిన బలస హర్ష ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్ సంస్థలో ఉద్యోగం సాధించి అందరినీ అబ్బురపరిచాడు. 22 సంవత్సరాల వయసులోనే ఏకంగా రూ.50 లక్షల వార్షిక వేతనం పొంది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‍గా మారాడు. నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఉన్నత శిఖరాలకు చేరేందుకు సాగిన అతని ప్రయాణం ఔరా అనిపిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నతస్థాయికి చేరిన సదరు యువకుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.


బలస హర్ష ప్రయాణం..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని కళాశాలలో చేరిన మెుదటి సంవత్సరం నుంచే బలంగా కోరుకున్నట్లు బలస హర్ష తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరినప్పుడు తనకు కోడింగ్‌పై అవగాహన లేదని, ఆ తర్వాత ప్రిన్సిపల్ చొరవతో నేర్చుకున్నట్లు చెప్పారు. కోడింగ్ గురించి ప్రిన్సిపల్ తరచూ చెప్తూ భౌవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలంటే నేర్చుకోవాల్సిందేనని చెప్పినట్లు పేర్కొన్నారు. హాకర్‌ఎర్త్ అనే ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తరచూ ప్రశ్నలు ఇచ్చి స్వయంగా సమాధానాలు కన్నుక్కొవాలని సూచించినట్లు తెలిపారు. గూగుల్ చేసినా పరిష్కారాలు దొరక్కపోవడంతో మెదడుగు పని పెట్టాల్సి వచ్చేదని, అదే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పుకొచ్చారు. అలా కోడింగ్‌పై ప్రాథమికంగా పట్టు సాధించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో పూర్తి స్థాయిలో దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో కోడ్‌ చెఫ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌ సైతం మెుదలు పెట్టినట్లు చెప్పారు హర్ష.


బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు హర్ష ప్రతిభ చూసిన బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఇంటర్న్‌షిప్ అవకాశం ఇచ్చింది. దీంతో తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం లభించింది. కళాశాల యాజమాన్యం వద్ద అనుమతి తీసుకుని ఇంటర్న్‌షిప్ చేసినట్లు హర్ష తెలిపారు. ప్రతి రోజూ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పని చేస్తూనే ఇంజినీరింగ్ సబ్జెక్టులపైనా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. స్నేహితుల నుంచి పాఠాలకు సంబంధించిన నోట్స్ తీసుకుని ప్రతి రోజూ రెండు గంటలపాటు చదివినట్లు తెలిపారు. మిగతా సమయమంతా ఇంటర్న్‌షిప్ పైనే పెట్టి కోడింగ్ కు సంబంధించి కొత్తకొత్త విషయాలు తెలుసుకునేవాడినని చెప్పుకొచ్చారు.


వివిధ సంస్థల్లో ఆఫర్..

అలా నాలుగేళ్లలో ఏకంగా మూడు ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసినట్లు చెప్పారు హర్ష. అదే సమయంలో చెన్నైకు చెందిన ఓ సంస్థ తనకు ఏడాదికి రూ.12 లక్షల వేతనంతో ఆఫర్ ఇచ్చిందని వెల్లడించారు. అయితే చివరి ఏడాది బెంగళూరు సంస్థ ఎఫ్‌ఐ మనీ రూ.20 లక్షల వార్షిక వేతనంతో తనకు ఉద్యోగం ఇచ్చినట్లు హర్ష చెప్పారు. అనంతరం ఆ సంస్థలో చేరి దాదాపు పది నెలలపాటు పని చేసినట్లు వెల్లడించారు. అక్కడ పని చేస్తున్నప్పుడే అమెజాన్ నుంచి ఆఫర్ వచ్చిందని, ఎంతో హార్డ్ వర్క్ చేసి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌డీఈ)గా ఉద్యోగం సాధించినట్లు హర్ష చెప్పారు. ఏకంగా రూ.50 లక్షల ప్యాకేజీతో జాబ్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు.


పట్టు అవసరం..

అయితే తాను బీటెక్‌ నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడే సీఆర్టీ శిక్షణలో పలు అంశాలను నేర్చుకున్నట్లు హర్ష తెలిపారు. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌పై పట్టు పెంచుకున్నట్లు వెల్లడించారు. అలాగే లీట్‌కోడ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకున్నట్లు పేర్కొన్నారు. పెద్దపెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు, సూచనలు తీసుకున్నానని, అలాగే వారి ఇంటర్యూలనూ చూసినట్లు చెప్పారు హర్ష. మరోవైపు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌కు సంబంధించి పలు పుస్తకాలను సైతం చదివినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అందరూ ఏఐ, ఎంఎల్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారని, వెబ్‌ డెవలప్‌మెంట్‌ పైనా దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా ఉన్నత లక్ష్యాలు సాధించే దిశగా చదవాలని తెలిపారు. ప్రతి విషయాన్నీ లాజికల్‌గా ఆలోచిస్తూ ఎంచుకున్న రంగంలో ప్రతి రోజూ కొత్తకొత్త విషయాలను నేర్చుకుంటే విజయం తథ్యమని హర్ష చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Home Minister Anitha:పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి సీరియస్

అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి లోకేష్

Updated Date - Mar 18 , 2025 | 01:05 PM