Share News

Indian Railway Board: విశాఖ జోన్‌పై ముందడుగు

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:27 AM

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యరూపం దిశగా ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా సీనియర్‌ అధికారి సందీప్‌ మాథుర్‌ను నియమిస్తూ గురువారం రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది.

Indian Railway Board: విశాఖ జోన్‌పై ముందడుగు

  • దక్షిణ కోస్తా జోన్‌ జీఎంగా సందీప్‌ మాథుర్‌

  • రైల్వే బోర్డు నియామక ఉత్తర్వులు

  • త్వరలో విశాఖలో నూతన బాధ్యతలు

  • ఆ వెంటనే జోన్‌ డీపీఆర్‌ పరిశీలన

  • తాత్కాలిక భవనాల ఎంపిక, కావలసిన

  • సిబ్బందిపై నివేదిక.. కేంద్రం గెజిట్‌!

  • ఆదేశాలివ్వగానే పరిపాలన ప్రారంభం

విజయవాడ, జూన్‌ 5 (ఆంధ్ర జ్యోతి): దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యరూపం దిశగా ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా సీనియర్‌ అధికారి సందీప్‌ మాథుర్‌ను నియమిస్తూ గురువారం రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ సిగ్నల్‌ ఇంజనీరింగ్‌ (ఐఆర్‌ఎస్ఎస్ఈ)లో ఆయన హయ్యర్‌ అడ్మినిస్ర్టేటివ్‌ గ్రేడ్‌ (హెచ్‌ ఏజీ) అధికారి. ప్రస్తుతం బోర్డులో సిగ్నల్‌ మోడ్రనైజేషన్‌ (పీఈడీ) విభాగంలో ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన ఆ పదవి నుంచి రిలీవ్‌ అయి.. విశాఖలో దక్షిణ కోస్తా జోన్‌ నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. జోన్‌ ఏర్పాటులో జీఎం నియామకం అత్యంత కీలకం. మాథుర్‌ ఈ బాధ్యతలు చేపట్టగానే.. జోన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను పరిశీలిస్తారు. కొత్త జోన్‌ పరిపాలనకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కార్యాలయాలను ఆయన గుర్తించాల్సి ఉంటుంది. రైల్‌ వికాస్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)కు చెందిన భవనాలు ఖాళీగా ఉన్నాయని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరరావు కూడా రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆర్‌వీఎన్‌ఎల్‌తో పాటు విశాఖ డివిజన్‌లో అందుబాటులో ఉన్న ఇతర భవనాలను మాథుర్‌ పరిశీలిస్తారు. అలాగే జోన్‌కు సంబంధించి ఆయా విభాగాలకు ఎంత మంది అధికారులు, సిబ్బంది కావాలో సమగ్ర నివేదికను రూపొందించి కేంద్రానికి పంపిస్తారు. ఆయన నివేదిక ఆధారంగా కేంద్రం.. పరిపాలన సాగించే భవనాలను ఖరారు చేయడంతో పాటు వెంటనే పోస్టులను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇస్తుంది. దీంతో పాటు అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అధికారికంగా ప్రారంభమవుతుంది. మరోవైపు.. కొత్త జీఎం విశాఖలో ఎప్పుడు బాధ్యతలు చేపట్టాలో విడిగా ఆదేశాలు ఇస్తామని రైల్వే బోర్డు తన ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం.


డివిజన్లు ఇలా..

కొత్త జోన్‌ డీపీఆర్‌ ప్రకారం విశాఖపట్నం డివిజన్‌ (రాయగడ మినహా) 410 కిలోమీటర్ల రైల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుంది. ఈ డివిజన్‌ పరిధిలోకి పలాస-విశాఖపట్నం-దువ్వాడ, కునేరు-విజయనగరం, నౌపాడ జంక్షన్‌-పర్లాకిమిడి, బొబ్బిల జంక్షన్‌-సాలూరు, సింహాచలం నార్త్‌-దువ్వాడ బైపాస్‌, వదలపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌-న్యూ జగ్గయ్యపాలెం సెక్షన్లన్నీ వస్తాయి. విశాఖపట్నం కాకుండా విజయవాడ రైల్వే డివిజన్‌ 1,068.194 కిమీ, గుంటూరు డివిజన్‌ 632.39 కిమీ, గుంతకల్‌ డివిజన్‌ 1,453 కిమీ.. వెరసి నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ 3,563.584 కిమీ రూట్‌ లెంగ్త్‌ను కలిగి ఉంటుంది. వీటిలో గుంతకల్‌ అతి పెద్ద డివిజన్‌. రెండో స్థానంలో విజయవాడ డివిజన్‌, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖ డివిజన్‌ ఉంటాయి. విశాఖపట్నం అతి చిన్న డివిజన్‌గా ఉంటుంది. కాగా.. జీఎంగా మాథుర్‌ నియామకం పై దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం సకాలంలో జీవో జారీ చేసి జోన్‌ పరిపాలనను కూడా త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఐదు నెలల తర్వాత..

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల. కొత్త జోన్‌ ఇస్తామని ప్రకటించిన అనేక సంవత్సరాలకు.. 2019లో దానిని మంజూరుచేశారు. కానీ పనులు చేపట్టకుండా తాత్సారం చేశారు. జగన్‌ ప్రభుత్వం భూములపై దాగుడుమూతలు ఆడింది. చివరకు కూటమి ప్రభుత్వం వచ్చాక భూమి సమస్య పరిష్కారం కావడంతో ఈ ఏడాది జనవరి 8న ప్రధాని మోదీ స్వయంగా విశాఖ వచ్చి రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఐదు నెలలు దాటినా జోన్‌కు సంబంధించిన గెజిట్‌ విడుదల చేయలేదు. కనీసం జీఎంను కూడా నియమించలేదు. ఒడిసాలోని కొత్త డివిజన్‌ రాయగడకు డీఆర్‌ఎంను నియమించి.. ఇక్కడ జీఎంను వేయలేదు. దీనిపై రైల్వే మంత్రికి జనవరి నెలాఖరులోనే విశాఖ ఎంపీ శ్రీభరత్‌ లేఖ రాశారు. ఆపై ఢిల్లీ వెళ్లినప్పుడల్లా గుర్తు చేస్తూ వచ్చారు. ఇప్పుడు జీఎంను నియమించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. గెజిట్‌ను కూడా త్వరగా విడుదల చేయాలని కోరామని, నిర్మాణ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు.

Updated Date - Jun 06 , 2025 | 03:29 AM