Visakha Metro Progress: విశాఖ మెట్రోపై కదలిక
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:38 AM
విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కొత్త కదలిక. ప్రొజెక్ట్‌కు కన్సల్టెంట్ కోసం ప్రకటన జారీ చేసింది. తొలి దశలో రూ.11,498 కోట్లతో 46.23 కిలోమీటర్ల మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధాన డిపో హనుమంతవాకలో ఏర్పాటు చేయబడుతుంది

కన్సల్టెంట్ కోసం ప్రభుత్వం ప్రకటన
మే 5న ప్రి-బిడ్డింగ్ సమావేశం
తొలి దశకు రూ.11,498 కోట్లు అవసరం
3 కారిడార్లు, 46.23 కి.మీ... హనుమంతవాకలో ప్రధాన డిపో
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి కన్సల్టెంట్ కావాలంటూ తాజాగా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. బిడ్డింగ్‌లో పాల్గొనే వారితో మే ఐదో తేదీన మంగళగిరి నుంచి ఆన్‌లైన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశ అమలుకు రూ.11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికి 99.75 ఎకరాలు కావాలని, భూ సేకరణకు మరో రూ.882 కోట్లు అవసరమని తేల్చారు. విశాఖ మెట్రోకు 100 శాతం నిధులు సమకూర్చాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే అట్నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను ఆమోదించారా?, లేదా? అనే దానిపైనా స్పష్టత లేదు. కానీ కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనే ఆశాభావంతో ముందుకువెళుతున్నారు. ఇక, విశాఖలో మొదట మూడు కారిడార్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొత్తం రూట్ పొడవు 46.23 కిలోమీటర్లు. ఇందులో మొదటిది స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కి.మీ. దీని పరిధిలో 290 స్టేషన్లు వస్తాయి.
రెండో కారిడార్ గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ 5.07 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ మార్గంలో ఆరు స్టేషన్లు ఉంటాయి. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కి.మీ. ఉంటుంది. ఇందులో ఏడు స్ట్టేషన్లు వస్తాయి. ఇక, విశాఖ మెట్రో రైలు కార్పొరేషన్.. లైట్ మెట్రో రైళ్లను నిలిపి ఉంచడానికి, ఆపరేషన్లు నిర్వహించడానికి హనుమంతవాక జంక్షన్‌లో 35 ఎకరాల్లో ప్రధాన డిపో ఏర్పాటు చేయనుంది. ఇక్కడి నుంచే మెట్రో రైళ్లను ఆపరేట్ చేస్తారు. దీనికి అనుబంధంగా విశాఖపట్నం విమానాశ్రయం సమీపాన కాకానినగర్‌లో మరో 35 ఎకరాల్లో అనుబంధ డిపో ఉంటుంది.
లైట్ మెట్రో.. తొలుత రెండే కార్లు
ప్రయాణికుల రద్దీ, ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తొలుత లైట్ మెట్రో కార్ (లఘు రైలు) నడపాలని నిర్ణయించారు. తొలి దశలో ప్రతి కారిడార్‌లోనూ రెండే రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే అదనంగా 3,4 కార్లు జత చేస్తారు. లైట్ మెట్రో కార్లయితే సౌకర్యవంతంగా ఉంటాయి. ఇంధన వ్యయం, శబ్దకాలుష్యం కూడా తక్కువగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News