Share News

Venkaiah Naidu: వీఐపీలు ఏడాదిలో ఒక్కసారే తిరుమలకు రావాలి

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:18 AM

వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారే శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు..

 Venkaiah Naidu: వీఐపీలు ఏడాదిలో ఒక్కసారే తిరుమలకు రావాలి

  • అప్పుడే మరింతమంది సామాన్యులకు శ్రీవారి దర్శనం లభిస్తుంది

  • దేవస్థానం నిధుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు

  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తిరుమల, జూలై 28(ఆంధ్రజ్యోతి): వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారే శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అప్పుడే మరింత మంది సామాన్య భక్తులకు దర్శన అవకాశం లభిస్తుందని చెప్పారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు సుమారు 80 వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారని అన్నారు. బయట ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆలయంలోపల దర్శనానికి ఉండే సమయం, స్థలం మాత్రం పరిమితంగానే ఉందనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వీఐపీలు తమ వారిని పరిమితంగా తీసుకురావడం, ఏడాదిలో ఒక్కసారే వచ్చే పద్ధతిని పెట్టుకోవడం వంటివి చేస్తే ఆలయ నిర్వహణకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని సలహా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు దేవాలయాలకు వచ్చినప్పుడు మరింత బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలన్నారు. భక్తులు సమర్పించే కానుకలను పూర్తిగా ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తుల సౌకర్యాల కల్పనకే ప్రధానంగా ఖర్చు చేయాలన్నారు. దేవస్థానం నిధుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. హిందూ ధార్మిక ఆలోచనలు మరింత పెంపొందించాలన్నదే హుండీలో కానుకలు సమర్పించడం వెనుకున్న ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకే మన ప్రాచీన సంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలన్నారు. ఇలాంటి కార్యక్రమాల కోసం ప్రముఖ దేవస్థానాలు, ముఖ్యంగా టీటీడీ వంటివి ముందుకు రావాలన్నారు. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యమని, గుడి కట్టించడం భక్తులు, దేవస్థానాల ప్రధాన కర్తవ్యం కావాలన్నారు. దేవస్థానం నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు ఇతర వాటికి మళ్లించాలనే ఆలోచన చేయకూడదన్నారు. స్వామిని దర్శించుకున్న వెంకయ్యనాయుడికి రంగ నాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:18 AM