Baptism Tragedy: మతమార్పిడిలో విషాదం
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:21 AM
బాపట్ల జిల్లాలో బాప్టిజం సందర్భంగా కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించగా, గ్రామంలో విషాదం నెలకొంది

బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి ఇద్దరి మృతి
మరో ముగ్గురిని కాపాడిన స్థానికులు
ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘటన
రేపల్ల్లె, భట్టిప్రోలు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): మతమార్పిడి సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జున్‌రావు తెలిపిన వివరాల మేరకు భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మతమార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటుండగా పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్‌బాబు, పెనుమాల హర్షవర్థన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు.
పెనుమాల దేవదాసు(19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు. గాలింపు చేపట్టి కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికితీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుధీర్‌బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని సురక్ష వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా దిగారని స్థానికులు తెలిపారు. గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా, దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్టిజం స్వీకరించేందుకు వెళ్లినట్టు తెలిసింది. గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్, రజని, దేవదాసు తల్లిదండ్రులు దేవేంద్ర, నాగలత వ్యవసాయ కూలీలు. యువకులు మృతి చెందిన విషయాన్ని కుటుంబసభ్యులు వారి తల్లులకు తెలియనీయలేదు. యువకుల మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.