Tungabhadra Dam Flood: పొంగుతున్న తుంగభద్ర
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:22 AM
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాంలో గురువారం సాయంత్రం 3 గంటలకు 78.01 టీఎంసీలు నీరు చేరింది.

డ్యాంలో 78.01 టీఎంసీలు.. 20 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. 875 అడుగులకు నీటిమట్టం
పోలవరం వద్ద గోదావరి పరవళ్లు
కర్నూలు/పోలవరం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాంలో గురువారం సాయంత్రం 3 గంటలకు 78.01 టీఎంసీలు నీరు చేరింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు. అయితే గతేడాది 19వ నంబరు గేటు కొట్టుకుపోవడం, మిగిలిన గేట్లు కూడా పటుత్వం దెబ్బతిన్నదని నిపుణులు సూచన మేరకు 80 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం 28,932 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులో 78.01 టీఎంసీలు నిల్వ చేసి, 20 గేట్లు రెండున్నర అడుగుల చొప్పున ఎత్తి దిగువకు 58,260 క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో బళ్లారి, కర్నూలు జిల్లాల్లోని నదితీర గ్రామాలు, మంత్రాలయంలో భక్తులను అప్రమత్తం చేసేందుకు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. రెండు రోజుల్లో సుంకేసుల డ్యాంకు తుంగభద్ర వరద చేరే అవకాశం ఉందని, కేసీ కాలువకు నీటి విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంజనీర్లు తెలిపారు. ఇక శ్రీశైలం జలాశయంలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, గురువారం 875.80 అడుగులకు నీటిమట్టం చేరింది. 167.48 టీఎంసీలకు నిల్వ పెరిగింది. ఎగువన జూరాల నుంచి విడుదల చేస్తున్న 64,611 క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. శ్రీశైలం డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నందున తక్షణమే ప్రభుత్వం రాయలసీమ కాలువలకు సాగునీరు విడుదల చేయాలని సాగునీటి నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
వాగుల నుంచి గోదావరికి..
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు, ఏజెన్సీలోని కొండ వాగులు పొంగుతున్నాయి. వరద నీరు గోదావరిలో కలుస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం గడిచిన మూడు రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి అదనంగా వస్తున్న 1,35,341 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు గురువారం జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నీటిమట్టం పెరగడంతో దిగువ కాఫర్ డ్యాంకి మట్టి, రాతి తరలింపు వాహనాలు కోసం వేసిన రోడ్డు పూర్తిగా నీటమునిగింది.