TTD: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
ABN , Publish Date - Jun 13 , 2025 | 09:45 PM
తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై అధికారికంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల క్షేత్రంలో భక్తులకు అందజేసే శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై (Tirupati Laddu Prasadam) ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా స్పందించింది. తిరుపతి లడ్డూపై తప్పుడు సమాచారం, అసత్య ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చేసిన ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించింది.
ప్రసాదం వల్ల గాయం?
తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి జూన్ 8న తిరుమలలో లడ్డూ ప్రసాదం తినేటప్పుడు తన నాలుకకు గాయం అయ్యిందని ఆరోపించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేశాడు. అయితే ఈ ఆరోపణపై టీటీడీ తక్షణమే స్పందించింది. సంబంధిత వ్యక్తికి వైద్య సహాయం అందిస్తూ తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది. అనంతరం మరింత స్పష్టత కోసం స్విమ్స్ (SVIMS) ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు చేశారు.
వైద్యుల నివేదిక
ఆ క్రమంలో వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఇతర పదార్థాలు లేవని, ఆరోపించిన గాయం అనేది నవీన్ కుమార్ తన నాలుకను తానే గట్టిగా కొరుక్కోవడం వల్లే సంభవించిందని తేలింది. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటన అని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, పరిహారం పొందాలనే ఉద్దేశంతో నవీన్ కుమార్ కావాలని లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని టీటీడీ వెల్లడించింది. దీనివల్ల లడ్డూ ప్రసాద విశ్వసనీయతపై ప్రశ్నలు వస్తాయని, లక్షాలాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యని టీటీడీ తీవ్రంగా అభిప్రాయపడింది.
టీటీడీ హెచ్చరిక
ఈ క్రమంలో తిరుమల లడ్డూ ప్రసాదం ప్రత్యేకత అంతా భక్తుల విశ్వాసంలో ఉందని టీటీడీ ప్రతినిధులు తెలిపారు. 300 సంవత్సరాలుగా ఈ ప్రసాదం భక్తులందరికీ పవిత్రంగా పంచబడుతోంది. ప్రసాద తయారీలో అత్యధిక పరిశుభ్రత పాటించబడుతుంది. అన్ని దశలలో నాణ్యత నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కానీ ఇలాంటి దుష్ప్రచారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయలేవన్నారు. అయినప్పటికీ, కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డ పోలీసు అధికారుల సంఘం
పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Read Latest Telangana News And Telugu News