Share News

TTD Board: అవన్నీ అవాస్తవాలే.. భూమన ఆరోపణలపై స్పందించిన టీటీడీ..

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:11 PM

TTD Board: టీటీడీపై భూమన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది. భూమన నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా టీటీడీ మీద బురద జల్లడం శోచనీయమంటూ మండిపడింది.

TTD Board: అవన్నీ అవాస్తవాలే.. భూమన ఆరోపణలపై స్పందించిన టీటీడీ..
TTD Board

తిరుమల తిరుపతి దేవస్థానంపై వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ బోర్డు స్పందించింది. టీటీడీపై భూమన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది. భూమన నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా టీటీడీ మీద బురద జల్లడం శోచనీయమంటూ మండిపడింది. టీటీడీ బోర్డు ఇంకా ఏమందంటే.. ‘శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని.. వేద పారాయణ చేసే వారితో అవహేళనగా మాట్లాడారనటం పూర్తిగా అవాస్తవం.


తిరుమలలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు కాలిబాట మార్గాల్లో కూడా ఓం నమో వేంకటేశాయ నామాన్ని ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం. అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది.


శ్రీవారి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో రెండు మఠాలకు నోటీసులు జారీ చేశాం. ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి.. భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది‌.


గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ.. క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా అన్నపానీయాలను అందిస్తున్నాం. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వారాంతాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం. ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది.


2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో ఎస్ఓపీ తయారు చేశాం. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ ఎస్ఓపీలో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

మెట్రో రైలులో కలకలం.. అలజడి సృష్టించిన పాము..

కాబోయే కోడలితో ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి..

Updated Date - Jun 20 , 2025 | 05:16 PM