Family Tragedy: విహారయాత్రలో విషాదం
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:25 AM
విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

కర్నూలు జిల్లాలో ట్రాక్టర్‌ను ఢీకొన్న స్కార్పియో
నలుగురు దుర్మరణం, ఆరుగురికి తీవ్రగాయాలు
ఓర్వకల్లు, జూలై 10(ఆంధ్రజ్యోతి): విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కడప జిల్లా మైదుకూరు పట్టణం మహబూబ్‌నగర్‌కు చెందిన షేక్ కమాల్ బాషా, అతని భార్య షేక్ మహబుబ్ చాన్, కుమార్తెలు, అల్లుడు, మనమరాలితో పాటు.. మరదలు మున్నీస, ఆమె కుమారుడు మున్నా మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోకి రాగానే నంద్యాల వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో షేక్ మున్నీస(40), షేక్ కమాల్ బాషా(50) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మహబూబ్ చాన్(49), మనవరాలు 3 నెలల నజియా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందారు. డ్రైవర్ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.