Share News

Maoist Encounter: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

ABN , Publish Date - Jun 19 , 2025 | 07:22 AM

దళపతి నంబాల కేశవరావును, సీనియర్‌ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Maoist Encounter: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

  • ఇద్దరూ మావోయిస్టు అగ్రనేతలే..

  • మరో నక్సల్‌ అంజూ కూడా మృతి

  • కగార్‌ దాడులతో అల్లూరి జిల్లాలోకి రాక

  • మూడుసార్లు తప్పించుకున్న రవి, అరుణ

  • డ్రోన్లతో జాడపట్టి ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌

  • నాడు ప్రభుత్వంతో చర్చల బృందంలో రవి

  • వరంగల్‌లో ఆర్‌ఎ్‌సయూ నేతగా మొదలై కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన రవి

  • మారేడుమిల్లి ఫారె్‌స్టలో కాల్చివేత

  • అగ్ర నాయకురాలు అరుణ, అంజూ కూడా..

చింతూరు/రంపచోడవరం, పాడేరు, చర్ల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): దళపతి నంబాల కేశవరావును, సీనియర్‌ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏవోబీ కమిటీ సీనియర్‌ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్‌ అరుణ (54), మరో నక్సల్‌ అంజూ కూడా ఈ ఘటనలో చనిపోయారు. వీరిలో అరుణ ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు రాంచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి భార్య. ఉమ్మడి ఏపీలో 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల బృందంలో ఉదయ్‌ ఒకరు. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్‌ కగార్‌ను తీవ్రతరం చేసింది. ఒడిశా అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ ఉండటం తమకు క్షేమం కాదని ఉదయ్‌ టీమ్‌ భావించింది. ఆయనతోపాటు యాభైమంది మావోయిస్టులు నెల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించారు.


డ్రోన్లతో జాడ పట్టి..

ఏపీ గ్రేహౌండ్స్‌ బలగాలు అల్లూరి జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పుల నుంచి మూడుసార్లు ఉదయ్‌, అరుణ త్రుటితో తప్పించుకున్నారు. కాకురి పండన్న అలియాస్‌ జగన్‌ కోరాపుట్‌ డీసీఎం రమేశ్‌ ఈ ఘటనల్లో చనిపోయారు. మరోవైపు, కీలక నేతల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఈనెల 20న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో గ్రేహౌండ్స్‌ బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. డ్రోన్‌లను ఉపయోగించి ఉదయ్‌ బృందం ఉన్న ప్రాంతాన్ని ఎట్టకేలకు కనిపెట్టాయి. పక్కా వ్యూహంతో మంగళవారం రంగంలోకి దిగాయి. దేవీపట్నం మండల పరిధిలోని ఆకూరు, కొయ్యలగూడెం గ్రామాల సరిహద్దుల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ బలగాలకు బుధవారం ఉదయం మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉదయ్‌ సహా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే 47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


గెరిల్లా యుద్ధ నిపుణుడు..

నాలుగు దశాబ్దాలపాటు గాజర్ల రవి మావోయిస్టు ఉద్యమంలో గణేశ్‌, ఉదయ్‌ పేర్లతో కొనసాగారు. రెండు దశాబ్దాల కాలం పూర్తిగా ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)కు పరిమితమై పనిచేశారు. సైనిక వ్యూహాలు రచించడం, గెరిల్లా యుద్ధ తంత్రంలో రాటుతేలిన ఆయన ఉద్యమ ప్రస్థానం 1980ల్లో రాడికల్‌ విద్యార్థి సంఘంతో మొదలైంది. 1990లో పీపుల్స్‌వార్‌ పార్టీలో పూర్తికాల కార్యకర్తగా చేరారు. ఉద్యమంలోనే జిలానీ బేగం అనే మహిళను వివాహం చేసుకోగా, ఆమె ఎన్‌కౌంటరులో మరణించారు. 2004లో అప్పటి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కార్యదర్శి బాకూరు వెంకటరమణ అలియాస్‌ గణేశ్‌ 2016 అక్టోబరు 24న రామ్‌గూడ ఎన్‌కౌంటరులో మరణించాక, ఆ బాధ్యతలను ఉదయ్‌ తీసుకున్నారు. ఆయనది తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఆయన కుటుంబం నుంచి ముగ్గురు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. వీరిలో పెద్ద అన్నయ్య గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటరులో చనిపోయారు. మరో అన్నయ్య గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు దండకారణ్యంలో పనిచేస్తూ, తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులకు లొంగిపోయారు. ఉదయ్‌పై తెలంగాణలో రూ.40 లక్షలు, ఏవోబీలో రూ. 25 లక్షల రివార్డు ఉంది. అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో, 76మంది జవాన్లను హత్యచేసిన తాడిమెట్ల ఘటనలో, నదిని దాటుతున్న జవాన్లపై బలిమెలలో దాడిచేసి హత్యచేసిన ఘటనలో ఉదయ్‌ నిందితుడు.


కిడారి, సోమ హత్యలకు స్కెచ్‌ అరుణదే

అరకు లోయలోని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద 2018 సెప్టెంబరు 23న టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యచేశారు. వారిద్దరి హత్యకు స్కెచ్‌ను అరుణే రూపొందించారని పోలీసులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఆమెది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఆమెది పూర్తిగా ఉద్యమ కుటుంబం. తండ్రి లక్ష్మణరావు మావోయిస్టు పార్టీ మాజీ నేత. తల్లి లత, తమ్ముడు ఆజాద్‌ వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించారు. అరుణ భర్త చలపతి ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఈ ఏడాది జనవరి నెలలో ఎన్‌కౌంటర్‌ అయ్యారు. అరుణ తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అంజూ వివరాలు తెలియరాలేదు.


చర్చల టీమ్‌లో మిగిలింది ఒక్కరే..

ఉమ్మడి ఏపీలో 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టులు చర్చ జరిపారు. ఈ చర్చల్లో అప్పట్లో మావోయిస్టు పార్టీ నాయకులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ, చలం అలియాస్‌ సుధాకర్‌, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌; జనశక్తి పార్టీ నాయకులు రియాజ్‌, దేవేందర్‌ అలియాస్‌ అమర్‌ పాల్గొన్నారు. ఆ బృందంలో ఇప్పుడు అమర్‌ ఒక్కరే మిగిలారు.

Updated Date - Jun 19 , 2025 | 07:22 AM