Tirupati News: నీకొకటి.. నాకొకటి.. అప్పుడు వారు.. ఇప్పుడు వీరు
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:57 AM
ఒకటి నీకు.. మరొకటి నాకు అన్నట్లుగా తిరుపతిలోని రాజకీయ పార్టీల నేతలు ఒక్కటైపోయారు. సిండికేట్ గా మారి షాపులను పంచుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో రెండు మెడికల్ షాపులను నామమాత్రపు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.
- రుయాలో రెండు మెడికల్ షాపులను పంచుకున్న నేతలు
తిరుపతి: స్విమ్స్‌లో మెడికల్ మాఫియాకు బ్రేక్ పడిందని అనుకునేలోపే, పక్కనే ఉన్న రుయా ఆస్పత్రికి విస్తరించింది. రాజకీయ నేతల ఒత్తిళ్లతో బుధవారం రెండు జనరిక్ మెడికల్ షాపులకు అనుమతిస్తూ నోట్‌ఫైల్ సిద్ధమైనట్లు తెలిసింది. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో రెండు మెడికల్ షాపులను నామమాత్రపు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏకంగా రుయాలోని స్థలం కేటాయించి గదులను వారినే కట్టుకోమని సూచించినట్టు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుయాస్పత్రిలో మెడికల్ షాపులకోసం నలుగురు నాయకుల నుంచి నాలుగు దరఖాస్తులు ఏడాది క్రితమే అధికారులకు అందాయి. ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో జనరిక్ మెడికల్ షాపు ఉండాలని, వాటిని రెడ్‌క్రాస్ సొసైటీ మాత్రమే నిర్వహించాలని మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో అధికారులు బయట వ్యక్తులకు కేటాయించలేకపోయారు.

ఇదిలావుంటే 2005లో టెండరు ద్వారా దక్కించుకున్న రెండు ప్రైవేట్ మెడికల్ షాపులు 2019వరకు రుయాకు అద్దెచెల్లిస్తూ నిర్వహించుకుంటూ వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక బలవంతంగా ఖాళీ చేయించి, ఆపార్టీ అనుచరులకు కట్టబెట్టారన్న విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించి మళ్ళీ వాటిని పూర్వపు నిర్వాహకులే చేజిక్కుంచుకుని ఇటీవల ప్రారంభించారు. ఈ రెండు కాకుండా మరొకటి రెడ్ క్రాస్ సొసైటీ జనరిక్ మెడికల్ షాపు నిర్వహిస్తోంది. జీవో నెంబరు 516 నిబంధనల మేరకు వెయ్యి పడకలు దాటిన ఆస్పత్రిలో మూడు మెడికల్ షాపులు మాత్రమే ఉండాలి.
ఆ మేరకు రుయాస్పత్రిలో ప్రస్తుతం 3 మెడికల్ షాపులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు షాపులు కేటాయిస్తే రుయాలో మొత్తం 5 మెడికల్ షాపులు ఉన్నట్టు అవుతుంది. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేకనే రుయా ఆధికారులు మెడికల్ షాపులను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అప్పగిస్తున్న మెడికల్ షాపులను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్ అనుమతి తీసుకున్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News