Share News

Railway Projects Andhra: నెరవేరిన దశాబ్దాల కల

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:16 AM

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల సంవత్సరాల కల నెరవేరింది

Railway Projects Andhra: నెరవేరిన దశాబ్దాల కల
Indian Railways

  • రూ.1,332 కోట్లతో తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు ఆమోదం

  • ఏటా 40 లక్షల టన్నుల సరుకు రవాణాతో

  • పరిశ్రమలకు లబ్ధి.. పర్యాటకానికి ఊపు

(చిత్తూరు/తిరుపతి-ఆంధ్రజ్యోతి)

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు దశాబ్దాల కల నెరవేరినట్టయింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్‌ లైన్‌ అందుబాటులోకి రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చిత్తూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇటీవల కొన్నేళ్లుగా ఈ మార్గంలో రైళ్ల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సింగిల్‌ లైన్‌తో రైళ్ల రాకపోకలకు తీవ్ర సమయాభావం పడుతోంది. మరోవైపు.. ఇదే లైన్‌లో ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక భారీగా పెరిగింది. దీంతో రైళ్ల సంఖ్యను పెంచడంతో సింగిల్‌ లైన్‌లోనే రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తిరుపతి-పాకాల-కాట్పాడిల మధ్య డబుల్‌ లైన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు కొన్నేళ్లుగా కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు. పార్లమెంటులోనూ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఈ అంశాన్ని లెవనెత్తుతూనే ఉన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ విషయంపై పలు మార్లు ఆయన కూడా కేంద్రానికి విన్నవించారు. ప్రస్తుతం తిరుపతి, వేలూరు ప్రాంతాలు విద్య, వైద్య రంగాలకు కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ డబ్లింగ్‌ పనులు పూర్తయితే.. స్థానికులకు, విద్యార్థులకు, రోగులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులో వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ 104 కిలోమీటర్ల పరిధిలో రైళ్లకు రద్దీ మరింత పెరగడం ద్వారా.. ఇతర వాహనాల వినియోగం తగ్గి.. ఏటా 20 కోట్ల కిలోల కార్బన్‌మోనాక్పైడ్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజల్‌ పొదుపుకానుంది.


బాబు ప్రత్యేక దృష్టి

సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నారు. భూసేకరణ, కొత్త రైలు మార్గాల నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, వెంకటేశ్వర్లు రైల్వే ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీఎంకు వివరించారు. తిరుపతి-కాట్పాడి మధ్య డబ్లింగ్‌కు ఆమోదం రాగానే భూసేకరణ వేగవంతం చేస్తామని అప్పట్లో చంద్రబాబుకు తెలిపారు.

డబ్లింగ్‌.. డబుల్‌ ధమాకా!

ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య ప్రస్తుతం సింగిల్‌ లైనుగా ఉన్న తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గాన్ని రెండు వరుసలకు(డబ్లింగ్‌) విస్తరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,332 కోట్లు ఖర్చుకానుంది. మొత్తం 104 కిలో మీటర్ల మేర డబ్లింగ్‌ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం ఢిల్లీలో తెలిపారు. కాగా, తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. 104 కి.మీ. మార్గంలో 17 మేజర్‌ వంతెనలు, 327 మైనర్‌ బ్రిడ్జిలు, ఏడు పైవంతెనలు, 30 అండర్‌పాస్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ స్టేషన్ల నడుమ అతిపెద్ద ఆలయం తిరుమలతోపాటు శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట, కాణిపాకం తదితర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. అదేవిధంగా ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల శ్రీ సిటీ, సిమెంటు పరిశ్రమలు, స్టీల్‌ ఉత్పత్తుల కంపెనీలు ఈ రైల్వే లైన్‌ ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఏడాదికి 4 కోట్ల లీటర్ల డీజిల్‌ ఆదా కానుంది. అంతేకాకుండా ఏటా రూ.449 కోట్ల లాజిస్టిక్‌ ఖర్చులు మిగులుతాయి. సుమారు 400 గ్రామాలు, 14 లక్షల జనాభాకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనాలు కలగనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి కనెక్టివిటీతో పాటు, శ్రీ కాళహస్తి, కాణిపాకం ఆలయం, చంద్రగిరి కోట వంటి ప్రముఖ ప్రదేశాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. కాగా, తిరుపతి-కాట్పాడి రైల్వేలైను డబ్లింగ్‌తో యాత్రికులు, పర్యాటకులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏపీ, తమిళనాడు మధ్య సరుకు రవాణా సౌకర్యం పెరుగుతుందన్నారు.


మోదీకి బాబు, రామ్మోహన్‌ ధన్యవాదాలు

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంపై ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కుసీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తిరుమల బాలాజీ, శ్రీకాళహస్తి శివయ్య, చంద్రగిరి కోట తదితర ప్రాంతాలకు రవాణాతోపాటు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. కనెక్టివిటీ పురోగతిలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా ప్రధానికి, రైల్వే మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్థిలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 08:57 AM