Paper Leak : బీఈడీ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఒడిసా ఏజెంట్లు
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:27 AM
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
పెదకాకాని, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యహ్నం ప్రశ్నపత్రం లీకేజీ ఘటన వెలుగులోకి రాగా యూనివర్సిటీ రిజిస్ర్టార్ ఆచార్య జి.సింహాచలం ఆ రోజు రాత్రి పెదకాకాని పోలీస్ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఈడీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం 70082 12851 మొబైల్ నంబరు ద్వారా జరిగిందని సమాచారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ఒడిశాకు చెందిన ధీరెన్ కుమార్ సాహూ అనే బీఈడీ విద్యార్థిని శుక్రవారం రాత్రి తెనాలిలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ర్టార్ ఫిర్యాదులో పేర్కొన్న మొబైల్ నంబరు అతను వాడుతున్నట్టు గుర్తించారు.
పోలీసుల విచారణలో ఒడిశాకు చెందిన గణేష్ సీహెచ్ సాహూ, మిలాన్ ప్రుస్తి అనే విద్యార్థులకు కూడా ఇందులో ప్రమేయం ఉందని తేలింది. దీంతో వారిద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశాకు చెందిన కొందరు ఏజెంట్ల రూపంలో ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీలోని ఏఎన్‌యూతోపాటు పలు యూనివర్సిటీలలో అడ్మిషన్ ఇప్పించడంతోపాటు వారిని ప్రాక్టికల్, థియరీ పరీక్షల్లో పాస్ చేయించడం వంటి పనులన్నీ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.