Share News

Supreme Court : మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఉన్న ఉద్రిక్తత సరిహద్దుల్లోనూ లేదు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:07 AM

మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, దీనిపై ఉన్న ఉద్రిక్తత దేశ సరిహద్దుల్లోనూ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీనియర్‌ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది

Supreme Court : మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఉన్న ఉద్రిక్తత సరిహద్దుల్లోనూ లేదు

  • ఒక్క వ్యాజ్యంపై నలుగురు సీనియర్‌ లాయర్లు వాదనలు వినిపిస్తారా?

  • సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

  • ఎంపీకి మధ్యంతర రక్షణ కొనసాగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ వ్యవహారంలో ఉన్నంత ఉద్రిక్తత దేశ సరిహద్దుల్లోనూ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మిథున్‌రెడ్డి ఈ నెల 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్దార్థ్‌ లూథ్ర, మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వి, నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. ఒక ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నలుగురు సీనియర్‌ న్యాయవాదులు వాదలను వినిపించడంపై జస్టిస్‌ పార్థీవాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ముందస్తు బెయిల్‌ వ్యవహారంలో ఉన్న ఉద్రిక్తత ప్రస్తుతం దేశ సరిహద్దుల్లోనూ లేదని అన్నారు. కాగా, తమకు కౌంటర్‌ అఫిడవిట్‌ ఇవ్వకుండా ప్రభుత్వ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించడం సరికాదని సింఘ్వీ అన్నారు. ప్రభుత్వ కౌంటర్‌ అన్ని విషయాలను బహిర్గతం చేస్తుందని లూథ్రా తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మిథున్‌రెడ్డి అసలు విచారణాధికారి ముందు హాజరయ్యారా? అని ప్రశ్నించింది. హాజరయ్యారని న్యాయవాది నిరంజన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం విచారణను ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది. మిథున్‌ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:07 AM