Share News

AP Govt : రెడ్‌జోన్లలో 100% కోళ్లు ఖననం

ABN , Publish Date - Feb 16 , 2025 | 03:56 AM

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ప్రభావిత కోళ్ల ఫారాలను ఆయన పరిశీలించారు.

AP Govt : రెడ్‌జోన్లలో 100% కోళ్లు ఖననం

  • బర్డ్‌ ఫ్లూ వచ్చినా వెల్లడించని యజమానులు

  • వైరస్‌ ఉధృతికి అది కూడా కారణమే

  • షెడ్లు మూడు నెలలు మూసి ఉంచాలని ఆదేశించాం

  • పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌

  • పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులో కోళ్ల ఫారాల పరిశీలన

యలమంచిలి/తణుకు రూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): బర్డ్‌ ఫూ బయటపడిన నాలుగు జిల్లాల్లోని రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో ఉన్న కోళ్లను నూరు శాతం ఖననం చేసినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధిశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ చెప్పారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ప్రభావిత కోళ్ల ఫారాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘కోళ్ల ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణం పెద్ద సమస్యగా మారింది. ఈ వైరస్‌ మొదట బాదంపూడి కోళ్ల ఫారంలో బయటపడింది. దీనికి కారణం కోళ్ల రెట్టలే. ఫారాల్లోని వ్యర్థాల్లో ఈకలు, ఫీడ్‌ మిశ్రమం పేరుకుపోవడం, వాటిని తినేందుకు కొంగలు, ఇతర పక్షులు రావడం, వాటిని తిన్న పక్షులు ఇక్కడి నుంచి వేరే ఫారాలకు వెళ్లడంతో వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వైరస్‌ గురించి ఫారాల్లో పనిచేసే కూలీలతోపాటు యజమానులు దాచిపెట్టడం కూడా వైరస్‌ ఉధృతికి కారణాలు. వైరస్‌ సోకిన షెడ్‌లను నూరు శాతం శానిటేషన్‌ చేసి, మూడు నెలలపాటు వాటిని మూసివేయాలని ఆదేశించాం. అధికారుల తనిఖీ తర్వాతనే వాటిలో కోళ్ల పెంపకం చేపట్టాలి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అన్నిరకాల చర్యలు చేపట్టింది. రెడ్‌జోన్‌ మినహా మిగిలిన ప్రాంతాల ప్రజలు కోడి గుడ్లు, చికెన్‌ ఉడికించి తినవచ్చు. ఈ వైరస్‌ మనుషులకు సంక్రమించదు.


ఏటా జనవరిలో కోళ్లలో ఈ వైరస్‌ కనిపించడం సర్వ సాధారణం. వాతావరణంలో వేడి పెరగడంతో వైరస్‌ తగ్గుముఖం పడుతుంది’ అన్నారు. ఆయన వెంట రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ టి.దామోదర్‌నాయుడు, కలెక్టర్‌ నాగరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ ఉన్నారు.

ఊటాడలో 3 వేల కోళ్లు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఊటాడ గ్రామంలోని ఒక పౌల్ర్టీ ఫారంలో శనివారం మూడు వేల కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. వీటిని గొయ్యి తీసి, సున్నం వేసి పూడ్చిపెట్టారు. కోళ్ల ఫారాన్ని భీమవరం డిప్యూటీ డైరెక్టర్‌ జవార్‌ హుస్సేన్‌, ఏడీ జి.మల్లేశ్వరరావు, పశువైద్యాధికారి పి.చంద్రశేఖరరెడ్డి పరిశీలించారు. గ్రామంలో చికెన్‌, కోడిగుడ్లు విక్రయించవద్దని వ్యాపారులకు నోటీసులు అందించారు. ఏలూరు ల్యాబ్‌ నుంచి వచ్చిన నిపుణులు కోళ్ల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం విజయవాడ, భోపాల్‌లోని ల్యాబ్‌లకు పంపించనున్నారు. కాగా, బాదంపూడికి కిలోమీటరు దూరంలో ఉన్న పెదతాడేపల్లి గ్రామంలోని 21 వేల కోళ్లను ఆదివారం ఖననం చేయనున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 03:56 AM