Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్ ఏదీ
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:50 AM
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ఒడిశా అధికారుల మోకాలడ్డు
కొత్తవలసను కూడా రాయగడ డివిజన్‌లో చేర్చాలని డిమాండ్
మళ్లీ ఆగిన జోనల్ ఆఫీస్ పనులు
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ఒడిశాలోని తూర్పు కోస్తా జోన్ అధికారులకు ఆది నుంచీ ఇష్టం లేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో వారు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత విశాఖలో కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏళ్ల సమయం పట్టింది. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే జోన్‌కు అవసరమైన భూ వివాదాలు పరిష్కరించి అధికారికంగా ముడసర్లోవలో 52 ఎకరాలు అప్పగించింది. దీనిలో కార్యాలయ సముదాయం నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 8న ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్ భవన నిర్మాణానికి రూ.149 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ అక్కడ పనులు ప్రారంభించగా వివాదాలు మొదలయ్యాయి. ఆ భూమి తమదంటూ కొందరు గిరిజనులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి యంత్రాలు అక్కడే ఆగిపోయాయి. వైసీపీ హయాంలోనూ గిరిజనులు ఇలాగే అడ్డుపడ్డారు. వారికి ఆ భూములపై హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు. అయితే, తాము చాలా కాలంగా ఇక్కడే జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సొంత భవనంతో సంబంధం లేకుండా రైల్వే జోన్‌ను ఆపరేషన్ చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజిట్ విడుదల చేస్తారు.
దీనిలో న్యాయపరమైన అంశాలు ఉంటాయి. జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ, తదితర వివరాలు పేర్కొంటారు. గతంలో అన్ని జోన్లకు గెజిట్ ప్రకటించాకే పనులు ప్రారంభించారు. విచిత్రంగా విశాఖలోని దక్షిణ కోస్తా జోన్‌కు మాత్రం ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 3 నెలలైనా దాని గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు. జోనల్ కొత్త కార్యాలయం నిర్మాణం రెండేళ్లలో పూర్తిచేయాలని నిబంధన పెట్టారు. కానీ, మూడు నెలలైనా అక్కడ మొక్కలు కూడా తొలగించలేదు. గెజిట్‌లో ‘ఆపరేషన్ డేట్’ ప్రకటిస్తే దాని ప్రకారం రైల్వే అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, ఉద్దేశపూర్వకంగా గెజిట్ ప్రకటించకుండా తొక్కి పెట్టారు.
కొత్తవలస కావాలని పేచీ
దక్షిణ కోస్తా జోన్ ప్రకటించిన సందర్భంలో వాల్తేరు డివిజన్‌ను విడగొట్టి కొత్తగా ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్ ఏర్పా టు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి అరకు వరకు రాయగడ డివిజన్‌లో చేర్చారు. అయితే, తాజాగా కొత్తవలస స్టేషన్‌ను కూడా ఈ డివిజన్‌కే ఇవ్వాలని తూర్పు కోస్తా జోన్ అధికారులు భువనేశ్వర్ నుంచి ఒత్తిడి చేస్తున్నారు. దీనికి బలమైన కారణం ఉందన్న చర్చ సాగుతోంది. ఆ పరిసరాల్లో రైల్వే వ్యాగన్ డిపో త్వరలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో కొత్తవలస స్టేషన్ కూడా తమ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అదయ్యాకే గెజిట్‌ను విడుదల చేయించాలనేది ఒడిశా నేతల ప్రణాళికగా ఉన్నట్టు సమాచారం.
మన నేతలు ఏం చేస్తున్నట్టు?
రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసేశాం కాబట్టి తమ పని అయిపోయిందని ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు భావిస్తున్నారు. అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేశ్ సాక్షాత్తూ రైల్వే స్టాండింగ్ కమిటీకి చైర్మన్. ఆయన దీనిపై దృష్టి పెడితే రెండు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రాలోనే కేంద్ర మంత్రి రామ్మెహన్‌నాయుడు ఉన్నారు. ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడినా గెజిట్ విడుదల అవుతుంది. ఆ దిశగా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.