SIT : సరఫరా చేసే సామర్థ్యం లేకున్నా.. నెయ్యి టెండర్లలో ఎలా పాల్గొన్నారు?
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:48 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజురాజశేఖరన్ (ఏ-2), బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ-3) విపిన్ జైన్(ఏ-4), వైష్ణవి డెయిరీ సీఈవో...

మార్కెట్ ధర కంటే తక్కువకు ఎందుకు కోట్ చేశారు?
నేతలు, సిబ్బంది పాత్ర ఏమిటి?
కల్తీ నెయ్యి నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం
తిరుపతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం తమ డెయిరీకి లేదని తెలిసి కూడా ఎందుకు టెండర్లలో పాల్గొన్నారని ఏఆర్ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించినట్లు తెలిసింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజురాజశేఖరన్ (ఏ-2), బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ-3) విపిన్ జైన్(ఏ-4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్దా (ఏ-5)ను వారంపాటు కస్టడీలో విచారణకు అనుమతి కోరగా.. తిరుపతి రెండో ఏడీఎం కోర్టు ఐదు రోజులు అనుమతించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం సిట్ అధికారులు రిజర్వు పోలీసు బలగాలతో తిరుపతి సబ్ జైలుకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని రుయా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేపట్టారు. వారిని ప్రశ్నించేందుకు హైదరాబాద్ నుంచి సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ నుంచి సీబీఐ డీఐజీ మురళీరాంబా తిరుపతి చేరుకున్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా.. ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌తో ఎప్పటి నుంచి పరిచయమో బోలేబాబా, వైష్ణవి డెయిరీల డైరెక్టర్లను సిట్ ప్రశ్నించింది. ‘బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధర ఎందుకు కోట్ చేశారు? కల్తీ చేయాలని ప్రేరేపించింది ఎవరు? రాజకీయ నేతల నుంచి, టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి ఏమైనా సహకారం అందిందా? ఇందులో వారి పాత్ర ఏమిటి? నాణ్యత లేని నెయ్యి సరఫరా గురించి టీటీడీ అధికారులు ఎవరైనా, ఎప్పుడైనా ప్రశ్నించారా’ అని రాజశేఖరన్‌ను అడిగి లోతుగా విచారించినట్లు సమాచారం.
ఇంకోవైపు.. సిట్ బృందం టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణతో పాటు ఆ విభాగం సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లను పిలిపించి విచారించింది. అలాగే నెయ్యి నాణ్యత నిపుణులు సురేంద్రనాథ్, విజయభాస్కర్‌రెడ్డిని కూడా ప్రశ్నించింది. అదే విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌ను విచారించారు. వారం తర్వాత మళ్లీ విచారణకు రావాలని ఆయనకు నోటీసిచ్చి పంపేశారు. మార్కెటింగ్ విభాగం గోదాముల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లనూ ప్రశ్నించి వివరాలు రికార్డు చేశారు.
నకిలీ ల్యాబ్ రిపోర్టు!
ఏఆర్ డెయిరీ నిర్వాహకులు టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతకు సంబంధించిన సర్టిఫికెట్లు, ల్యాబ్ రిపోర్టులు అందజేశారు. వాటిలో చెన్నైకి చెందిన ప్రైవేటు ల్యాబ్ ఎస్‌ఎంఎస్ ల్యాబ్ జారీ చేసినట్లుగా సర్టిఫికెట్ సమర్పించారు. అందులో నెయ్యి నాణ్యత బాగుందని నిర్ధారించినట్లుగా ఉంది. దీనిపై దృష్టిసారించిన సిట్ అధికారులు.. ఏఆర్ డెయిరీలో ఎస్‌ఎంఎస్ ల్యాబ్ జారీ చేసిన ఒరిజినల్ రిపోర్టు ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తే ఏఆర్ డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లేదని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. దీనినిబట్టి ఒరిజినల్ రిపోర్టును దాచి అదే ల్యాబ్ పేరిట నకిలీ రిపోర్టు సృష్టించి టీటీడీకి సమర్పించినట్లు భావిస్తున్నారు. కాగా.. ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీల నిర్వాహకులు నెయ్యి సరఫరా ట్యాంకర్లకు రెగ్యులర్ డ్రైవర్లయితే గుట్టు బయటపడుతుందని.. తాత్కాలిక డ్రైవర్లను నియోగించినట్లు సిట్ గుర్తించింది.
టీటీడీ అధికారులు, పాలకవర్గాల పాత్రపై దృష్టి
టీటీడీలో నెయ్యి సేకరణలో మార్కెటింగ్ విభాగంలోని ప్రొక్యూర్‌మెంట్ సెక్షన్ పాత్ర కీలకం. నెయ్యి నాణ్యత, పరిమాణం మొదలైనవాటిని ఆ విభాగం అధికారులు, సిబ్బందే పరిశీలించాల్సి ఉంటుంది. దీనితో పాటు టీటీడీలో పర్చేజెస్ కమిటీలో ముఖ్య అధికారులు, పాలకవర్గం సభ్యులు కొందరు అందులో సభ్యులుగా ఉంటారు. ఇదికాక టెక్నికల్ కమిటీ ఉంటుంది. నెయ్యి సరఫరా చేసే డెయిరీలు, ప్లాంట్లు తనిఖీ చేసే బాధ్యత దానిదే. సమాంతరంగా విజిలెన్స్ వ్యవస్థ ఉంది. అయితే ఈ విభాగాలు, కమిటీలు స్పందించకపోవడంతో తెరవెనుక ఒప్పందాలు జరిగి ఉండొచ్చని సిట్ అనుమానిస్తోంది. రెండోదశ దర్యాప్తులో నెయ్యి నాణ్యత, తెర వెనుక ఒప్పందాలు, ఎవరు ఎంత లబ్ధి పొందారు.. కల్తీకి కారకులు, బాధ్యులెవరు అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించనుంది.
సిట్‌కు అదనపు సిబ్బంది
సిట్‌లో సిబ్బంది చాలకపోవడంతో తిరుపతి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నరసింగప్ప, పల్నాడు జిల్లా కారంపూడి సీఐ శ్రీనివాసరావును అదనంగా కేటాయించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి