Sajjala Rama Krishna Reddy: సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:19 AM
అమరావతి మహిళలను అవమానించారని యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఎనలిస్టు కృష్ణంరాజు ఫొటోలను చెప్పులతో కొట్టడం వంటి పనులు సంకరజాతి తెగవారే చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

రాక్షసులు, పిశాచాలు కూడా చేయవు
కొమ్మినేని ఫొటోలను చెప్పులతో కొడతారా?
తప్పంతా చంద్రబాబు, లోకేశ్‌దే: సజ్జల
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలను అవమానించారని యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఎనలిస్టు కృష్ణంరాజు ఫొటోలను చెప్పులతో కొట్టడం వంటి పనులు సంకరజాతి తెగవారే చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాక్షసులు, పిశాచాలు కూడా ఇలాంటివి చేయవన్నారు. సంకరజాతి తెగ పూనుకుంటేనే ఇలా చేయగలుగుతుందని.. ఈ తెగ వ్యవస్థీకృతమైందని చెప్పారు. ఇది పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని.. కమ్ముకుని దెబ్బకొడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తప్పంతా సీఎం చంద్రబాబు, టీడీపీ లో రెండో వ్యక్తో.. ఒకటిన్నర వ్యక్తో అయిన మంత్రి లోకేశ్దేనని చెప్పారు. కొమ్మినేనిని నిష్పక్షపాత జర్నలిస్టుగా, తమ అధినేత జగన్‌ను మహిళా పక్షపాతి గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్నారంటే మహిళలను అవమానించిన ట్లా.. అమరావతి చుట్టుపక్కల సెక్స్‌వర్కర్లు ఉన్నారని కృష్ణంరాజు చెబితే దానిని అమరావతి మహిళలకు ఆపాదిస్తారా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా మహిళలపై అఘాయి త్యం జరిగిందా అని ప్రశ్నించారు. పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని.. నిష్పాక్షికంగా వ్యవహరించేవారిపై కక్ష గడుతున్నారని విమర్శించారు. డిబేట్లో ఎనలిస్టు ఒకసారి అని ఊరుకుంటే.. అధికారపక్షం దానిపై మళ్లీ మళ్లీ మాట్లాడుతూ అమరావతి మహిళలను అవమానిస్తోందన్నారు. దీనిపై వైసీపీ మహిళా విభాగం తరఫున మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని నేతలను ఆదేశించారు.