Monsoon Water Release: సాగర్ గేట్లెత్తారు 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలోనే నీటి విడుదల
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:10 AM
నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో మొత్తం 26 గేట్లనూ 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2.10 లక్షల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో మొత్తం 26 గేట్లనూ 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్షణ్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం 10గంటలకు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. డ్యాం నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 305.74 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్‌కు 2,28,900 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జూలైలో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం గత 18 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక పులిచింతలలో నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 28.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల మూడు గేట్లను 3అడుగుల మేర ఎత్తి 47,256 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 18వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు బుధవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుందని నీటి పారుదల శాఖ అధికారి మోహనరావు తెలిపారు.
శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం డ్యాం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,16,520 క్యూసెక్కులు. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం మరో 65,712 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి 2,67,850 క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. ప్రస్తుతం 203.4290 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మళ్లీ పెరిగిన గోదారి ఉధృతి
గోదావరి వరద పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. సోమవారం స్వల్పంగా తగ్గిన నీటిమట్టం మంగళవారం నాటికి మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. అదనంగా వస్తున్న 6,70,355 క్యూసెక్కులను స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35.30 అడుగులకు చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News