Share News

Vizag IT Park Delay: ఐటీ భవనాలన్నీ ఖాళీ

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:07 AM

రుషికొండలో కంపెనీలు భూములు తీసుకుని భవనాలు నిర్మించినప్పటికీ, దశాబ్దంగా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. అదానీ డేటా సెంటర్‌ సహా అనేక ప్రాజెక్టులు కేవలం ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి

Vizag IT Park Delay: ఐటీ భవనాలన్నీ ఖాళీ

  • విశాఖలో భూములు తీసుకొని పట్టించుకోని కంపెనీలు.. కార్యకలాపాలు ప్రారంభించకుండా కాలక్షేపం

  • విశాఖలో 2లక్షల చ.అడుగులు అందుబాటులో.. నామమాత్రపు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న విప్రో

  • హామీ నెరవేర్చలేదని రిజిస్ట్రేషన్‌ ఆపిన ప్రభుత్వం.. రుషికొండలో దాదాపు పదేళ్ల నుంచి ఇదే పరిస్థితి

  • అదానీ డేటా సెంటర్‌కు సుమారు 200 ఎకరాలు.. కొండపైకి రోడ్డు తప్ప అడుగు ముందుకు పడలేదు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో ఐటీ భవనాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దశాబ్దాల క్రితమే ప్రభుత్వం కేటాయించిన భూములు తీసుకున్న కంపెనీలు వాటిల్లో కార్యకలాపాలు మాత్రం ప్రారంభించడం లేదు. ఈ జాబితాలో పెద్దపెద్ద సంస్థలు కూడా ఉండటం గమనార్హం. ఒక్క రుషికొండ ఐటీ పార్కులోనే సుమారు 2లక్షల చ.అ. విస్తీర్ణం ఖాళీగా ఉంది. రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న పలు ఐటీ సంస్థలు దశాబ్దం దాటినా ఆ హామీని నెరవేర్చకుండా భవనాలను ఖాళీగా ఉంచేశాయి. కొన్ని సంస్థలైతే తీసుకున్న భూముల్లో భవనాలు నిర్మించి అక్కడితో పని అయిపోయినట్టు చేతులు దులుపుకొన్నాయి. 2006లోనే విశాఖ నగరం నడిబొడ్డున 7ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం విప్రో టెక్నాలజీ్‌సకు కేటాయించింది. అందులో 6,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. చాలాకాలం పాటు ఆ భూమిని ఖాళీగా ఉంచిన విప్రో.. ఆ తరువాత 4ఎకరాల్లో ఆరు అంతస్థుల భవనాన్ని నిర్మించింది. దానిని కూడా ఖాళీగా ఉంచింది. విశాఖ ఎంపీగా పురందేశ్వరి ఉన్న సమయంలో నాటి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో కలసి ఆ భవనాన్ని సందర్శించారు. వెంటనే ఆపరేషన్లు ప్రారంభించి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే భూ కేటాయింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. దాంతో అప్పటికప్పుడు 300 మందితో కార్యకలాపాలు ప్రారంభించారు. పక్కనే ఉన్న 3ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) ఏర్పాటుకు దరఖాస్తు చేయగా2014లో కేంద్రం అనుమతి ఇచ్చింది. అందులో కూడా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీని పూర్తి చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విప్రోకి భూమి రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆపేసింది.


ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అందులో కొన్ని (2, 5, 6) అంతస్థులను ఆరేళ్ల క్రితం 2019లో ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ (పల్సస్‌) సంస్థకు అద్దెకు ఇవ్వగా వారు దాదాపు వెయ్యి మందికి ఉపాధి కల్పించారు. అయితే అక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులను విదేశాలకు రాయితీపై ఎగుమతి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆ సంస్థ కూడా కొద్ది కాలానికే ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఒమిక్స్‌ అద్దెకు తీసుకున్న భవనం సెజ్‌ పరిధిలో లేకపోవడమే దీనికి కారణం. అంతకుముందు విప్రోతో లీజు ఒప్పందానికి ఒమిక్స్‌ ప్రయత్నించింది. ఆ భూమి విప్రో పేరుతో లేదని రిజిస్ట్రేషన్ల శాఖ తిరస్కరించింది. దాంతో ఒమిక్స్‌ ఆ ప్రాంగణం ఖాళీ చేసింది. తాజాగా ఈ నెల మొదటి వారంలో తమను మోసం చేశారంటూ విప్రోపై ద్వారకానగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. విదేశాలకు ఐటీ ఎగుమతులు చేసుకునే అవకాశం లేకపోవడంతో దాదాపు రూ.200 కోట్ల వరకు నష్టపోయామని ఆరోపించింది. ప్రస్తుతం విప్రో చేతిలో ఏడు ఎకరాలు ఉండగా, నామమాత్రపు ఉద్యోగులతోనే నడుస్తోంది.


రుషికొండలో ఇదీ పరిస్థితి

రుషికొండ హిల్‌ నం.2లో కలర్‌ చిప్స్‌కు 2 ఎకరాలు, మిరాకిల్‌కు 2ఎకరాలు, ఆ పక్కనే మరో సంస్థకు 3 ఎకరాలు కేటాయించారు. వీరంతా భవనాలు అయితే నిర్మించారు కానీ కార్యకలాపాలు మాత్రం ప్రారంభించలేదు. సుమారు పదేళ్లుగా ఈ భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. కనీసం అద్దెకు కూడా ఇవ్వలేదు. అలాగే హిల్‌ నం.3లో ఎక్స్‌టీ గ్లోబల్‌ ఐదేళ్ల క్రితం నిర్మించిన భవనం కూడా ఖాళీగానే ఉంది. ఇవికాకుండా ఇంకా పలు పెద్ద కంపెనీలు భూములు తీసుకొని ఇప్పటివరకూ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. అదానీ డేటా సెంటర్‌ కోసం మధురవాడ హిల్‌ నం.4పై సుమారు 200 ఎకరాలు కేటాయించారు. శంకుస్థాపనలు కూడా జరిగి ఏళ్లు దాటిపోయాయి. కొండ మీదకు రోడ్డు తప్ప ఇంకేమీ చేయలేదు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని కూటమి ప్రభుత్వం అడగడంతో ప్రహరీ నిర్మాణం మాత్రం చేపడుతున్నారు. ఇప్పట్లో డేటా సెంటర్‌ ఏర్పాటుచేసే ఆలోచన వారికి లేదని ఐటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఎవరికి భూములు ఇచ్చినా ఎంత గడువులో ఆపరేషన్లు ప్రారంభిస్తారో స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 20 , 2025 | 05:08 AM