Free Medical Help: కొత్తచెరువు విద్యార్థికి వైద్య సాయం
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:56 AM
అరుదైన రుగ్మతతో బాధపడుతున్న శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బాలుకు ఉచిత వైద్య సాయం ..

అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న విద్యార్థి
‘మెగా పీటీఎం 2.0’లో సీఎం చంద్రబాబు పలకరింపు
బాలుడి ఆరోగ్యం గురించి ఆరాతో సమస్య వెలుగులోకి
‘ఆంధ్రజ్యోతి’లో కథనం.. స్పందించిన హైదరాబాద్ వైద్యులు
ఉచిత వైద్యానికి ముందుకొచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు
కొత్తచెరువు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అరుదైన రుగ్మతతో బాధపడుతున్న శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బాలుకు ఉచిత వైద్య సాయం అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు నామినేని ముందుకొచ్చారు. కొత్తచెరువులో ఈనెల 10న ‘మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ 2.0’ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తచెరువు బీసీ కాలనీకి చెందిన మాధవి తన నలుగురు పిల్లలకు తల్లికి వందనం సొమ్ము అందడంతో.. సీఎం చంద్రబాబును కలిసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సమయంలో ఆమె కుమారుడు బాలు.. జుట్టు, శరీరంలో మార్పులను గమనించిన సీఎం.. సమస్య ఏమిటని ఆరా తీశారు. పుట్టుకతోనే ఆరోగ్య సమస్య వచ్చిందని.. వైద్యం చేయించినా నయం కాలేదని మాధవి సీఎంకు వివరించారు. దీంతో బాలుకు వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక, ఏబీన్ చానల్‌లో కథనాలు వచ్చాయి. స్పందించిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాసరావు.. బాలుడుకి వైద్య సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రెయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రి డెంటల్ విభాగం, ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డీసీజెస్ ఇలాంటి అరుదైన వ్యాధులకు వైద్యం చేస్తాయని, బాలుకు ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.