Vijayasai Reddy Liquor Controversy: సూత్రధారి కసిరెడ్డే
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:03 AM
మద్యం స్కామ్‌కు ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ పాలసీలో తన పాత్ర పరిమితమైందని, అవసరమైతే తిరిగి విచారణకు హాజరవుతానని తెలిపారు.

ఆయన తోడల్లుడు లిక్కర్ నెట్‌వర్క్ నడిపాడు
స్కామ్‌లో బిగ్‌బాస్ ఉన్నదీ లేనిదీ తెలియదు: సాయిరెడ్డి
వ్యాపారం చేసుకుంటామంటే ‘అరబిందో’కు చెప్పి కసిరెడ్డి, మిథున్‌రెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించా
నాడు ప్రోత్సహించినందుకు బాధ పడుతున్నా
హైదరాబాద్, విజయవాడల్లో లిక్కర్ సమావేశాలు హాజరైన మిథున్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి
ముడుపుల విషయం నేను చెప్పలేను
సిట్‌కు అంతా చెప్పేశా..పిలిస్తే మళ్లీ వస్తానని చెప్పా
మీడియాకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి
తెలివైన క్రిమినల్
రాజ్ కసిరెడ్డిని వైసీపీలోని వ్యక్తులు నాడు తనకు పరిచయం చేశారని విజయసాయి తెలిపారు. ‘‘2017-18లో కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. ఆయన ఒక తెలివైన క్రిమినల్. ఈ విషయం తెలియక ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగి ంచాను. మొట్టమొదట ఎన్‌ఆర్‌ఐ విభాగం అప్పగించాను. ఆ తర్వాత సోషల్ మీడియా విభాగం చూసుకోమని చెప్పాను. అనంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ ప్రొటోకాల్ బాధ్యతలు అప్పగించాను. పార్టీ పెద్దలు చెప్పారని ఆయనను ప్రోత్సహించింది నేనే. ఈ విషయంలో తప్పు చేశానన్న భావన ఇప్పుడు కలుగుతోంది. రాజ్ కసిరెడ్డి గురించి ఐదేళ్లపాటు నేను ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు. ఆ రోజున మీడియా అడగలేదు. నేను చెప్పలేదు. రాజ్ కసిరెడ్డి వెనుక ఉన్న వ్యక్తుల గురించి మీడియా చెప్తే నేను సంతోషిస్తా. కానీ, ఆయన ఆనాడు పార్టీని, ప్రజలను మోసం చేశారు’’ అని విజయసాయి ఆగ్రహించారు.
విజయవాడ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఈ స్కామ్‌లో భాగంగా పక్కా నెట్‌వర్క్‌ను ఆయన తోడల్లుడు అవినాశ్‌రెడ్డి నడిపించారని తెలిపారు. లిక్కర్ పాలసీపై జరిగిన మొదటి రెండు సమావేశాల్లో మాత్రమే తాను పాల్గొన్నానని, అవి హైదరాబాద్, విజయవాడల్లో జరిగాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో అరబిందో శరత్‌చంద్రారెడ్డి నుంచి రూ. 100 కోట్లు అప్పుగా ఇప్పించానని ఆయన చెప్పారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరయిన ఆయన, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగు అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. ‘‘2019లో హైదరాబాద్, విజయవాడల్లో లిక్కర్‌కు సంబంధించిన సమావేశం జరిగిందా? అని ప్రశ్నించారు. ఆ రెండు చోట్ల జరిగిన భేటీల్లో నేను పాల్గొన్నట్టు తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారు.
వాటిల్లో పాల్గొన్నట్టు నేను అంగీకరించాను. మొదటి భేటీలో నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిఽథున్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఎస్పీవై బిజ్లరీస్) హాజరయ్యారని, వారే రెండో సమావేశంలోను పాల్గొన్నారని తెలిపాను. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి హాజరు కాలేదని చెప్పాను. ఈ సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించినట్టు చెప్పాను. ముడుపుల విషయం తెలియదన్నాను. వ్యాపారం చేసుకుంటామని రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, మిఽథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి రూ.100కోట్లు ఇప్పించానని చెప్పాను. రాజ్ కసిరెడ్డి చెప్పిన ఆడాన్ కంపెనీకి రూ.60కోట్లు, డీకార్ట్ కంపెనీకి రూ.40కోట్లు రికమండ్ చేసి ఇప్పించారా? ఎవరు చెబితే ఇప్పించారని అధికారులు ప్రశ్నించారు. నేనే రికమండ్ చేసి ఇప్పించానని చెప్పాను. అడాన్ కంపెనీని ఎవరు తీసుకువచ్చారు? ఎలా తీసుకువచ్చారు? ఏ కారణంతో తీసుకువచ్చారు? అన్న విషయం నాకు తెలియదని చెప్పా. ఒడిశాలో అమ్మకందారు, చెన్నైలో కొనుగోలుదారు ఉండగా ఏపీ మీదుగా సరుకు వెళ్తున్నప్పుడు దానికి డ్యూటీ లేకుండా మళ్లించి అమ్మకాలు చేశారా అని అడిగారు. వాటికి రాజ్ కసిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పగలరని చేశాను. రాజ్ కసిరెడ్డి స్థానికంగా ఉన్న ఈబీ స్పిరిట్స్‌తోపాటు మరో రెండు కంపెనీలను లీజుకు తీసుకుని అందులో తయారు చేసిన కొత్త బ్రాండ్లను ఎలాంటి డ్యూటీ లేకుండా బెల్టు షాపుల ద్వారా అమ్మారా అని అధికారులు ప్రశ్నించారు. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వవలసిన అంశమని చెప్పా.. పిలిస్తే మరోసారి విచారణకు వస్తానని చెప్పాను.’’ అని విజయసాయి వివరించారు.
అది మిథున్‌రెడ్డినే అడగండి
మిథున్‌రెడ్డికి లిక్కర్ స్కాంతో సంబంధం ఉందో లేదో ఆయననే అడిగి తెలుసుకోవాలని అధికారులకు తెలిపానని విజయసాయి వివరించారు. మీడియా వేసే ఊహాజనిత ప్రశ్నలకు స్పందించలేనన్నారు. ‘‘కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లిక్కర్ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ అని ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. తెలియని విషయాలను తెలిసినట్టుగా చెప్పను. స్కాం జరిగిందా లేదా అన్న విషయం పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డిని పట్టుకున్నతర్వాత ఆయననే అడగండి. దీని వెనుక బిగ్‌బాస్ ఉన్నారో లేదో నాకు తెలియదు. రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు కలిసి పనిచేశారని, నెట్‌వర్క్‌లో ఎవరున్నారని అధికారులు అడిగారు. రాజ్ కసిరెడ్డి, ఆయన కో బ్రదర్ (తోడల్లుడు) అవినాశ్‌రెడ్డి, అనుచరుడు చాణుక్య అలియాస్ ప్రకాశ్, కిరణ్, సుమిత్, సైఫ్‌తోపాటు చాలామంది నెట్‌వర్క్‌లో ఉన్నారని వివరించాను.’’ అని వివరించారు.
నంబరు 2 అనేది లేదు..
యూట్యూబ్, శాటిలైట్ చానళ్లలో సాయిరెడ్డి నంబరు 2 అని చెబుతున్నారని, కానీ ప్రాంతీయ పార్టీల్లో నంబరు 2 స్థానం ఉండదని మాజీ ఎంపీ వివరించారు. ‘‘ఒకటి నుంచి 100 వరకు ఎవరూ ఉండరని, 101 నుంచే ఉంటారని అప్పట్లో మా పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్పారు. నంబరు 2 స్థానం ఒక మిఽథ్య. అధికారంలో లేనప్పుడు, 2014 నవంబరు నుంచి 2019 వరకు ఒంటి చేత్తోతో పార్టీని నడిపాను. జగన్ ఆదేశాలను నేను, ప్రశాంత్ కిషోర్ అమలు చేశాం. అప్పుడూ నన్ను నేను నంబరు 2గా భావించుకోలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే నంబరు 2 మిఽథ్య అన్న విషయాన్ని గమనించాను. నా విషయంలో తినగ తినగ వేము తియ్య అన్న సామెత నిజమనిపిస్తోంది. కోటరీ నా మీద జగన్‌కు చెప్పారు. సాయిరెడ్డి ఎప్పటికైనా వెన్నుపోటుదారుడవుతాడు, ఏ రోజైనా స్థానభ్రంశం చేస్తాడు అని చెప్పారు. నేను ఏదో వేల కోట్ల రూపాయలు దోచేశానని ఆయనకు చెప్పి అపవాదును మోపారు. ఈ కోటరీ మీడియా అనుకుంటున్న రెండో స్థానం నుంచి నెమ్మదిగా తగ్గించుకుంటూ 2000 స్థానంలో నన్ను పడేసింది. చాలా అవమానాల పాలయ్యాను. అవమాన భారం భరించలేక, కోటరీ వేధింపులు తట్టుకోలేక అప్పటి మా నాయకుడి మనస్సులో స్థానం లేదని గ్రహించి పార్టీని వీడాను.’’ అని విజయసాయి తెలిపారు
‘సాక్షి’ని నేనే పెట్టించా
సాక్షి పత్రిక, చానల్‌ను తానే పెట్టించానని విజయసాయి తెలిపారు. ఆ ముసలోడు(విజయసాయిరెడ్డి) వ్యవసాయం చేసుకుంటానని చెప్పి రాజకీయాలు చేస్తున్నాడంటూ సాక్షి చానల్‌లో కేఎ్‌సఆర్ లైవ్‌షోలో వ్యాఖ్యలు చేయించారన్నారు. ‘‘రాజీనామా చేసినప్పుడు ఒకసారి, సీఐడీ విచారణకు పిలిచినప్పుడు మరోసారి మాత్రమే నేను రాజకీయాలు మాట్లాడాను. కానీ, కొంతమంది ఏదోదో మాట్లాడుతున్నారు. నన్ను రాజ్యసభకు పంపుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తున్నారని, వేరే రాష్ట్రానికి ఇన్‌చార్జిగా పంపుతున్నారని.. ఏదేదో ఊహించుకుంటున్నారు. నేను ఏ రోజూ ఎంపీ సీటు అడగలేదు. ఇప్పుడు నేను వైసీపీలో లేను. అందువల్ల ఏదైనా చేయవచ్చు. రాజకీయాల్లోకి రావాలంటే మీ (సాక్షి చానల్‌ను ఉద్దేశించి) అనుమతి కావాలా? వ్యవసాయాన్ని వదిలేసి వ్యాపార రంగంలోకి వెళ్తాను. అది నా ఇష్టం.’’ అని విజయసాయి స్పష్టం చేశారు.
సాయిరెడ్డి ‘భ్రాంతి’!
‘ఆంధ్రజ్యోతి’పై తప్పుడు ఆరోపణలు
రాయనిది రాసినట్లుగా ‘భ్రమలు’
విజయసాయి రెడ్డి వైసీపీని వీడినా... భ్రమలు, భ్రాంతులు మాత్రం ఆయనను వీడలేదు. అసందర్భంగా, అనవసరంగా ‘ఆంధ్రజ్యోతి’ని ఆయన ఆడిపోసుకున్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో ‘సిట్’ విచారణకు హాజరైన తర్వాత... మీడియాతో మాట్లాడారు. శుక్రవారం (18న) విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ కొద్దిరోజుల కిందట నోటీసులిచ్చింది. అయితే, శుక్రవారం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నందున, 17నే వస్తానని ఆయన సమాచారమిచ్చారు. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ‘మద్యం స్కామ్ కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి’ అని గతంలో ఆయన చెప్పిన మాటలనే గుర్తు చేసింది. అయితే... శుక్రవారం మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి అనవసరంగా ‘ఆంధ్రజ్యోతి’ని ఆడిపోసుకున్నారు. ‘‘ముందుగా రావడానికి నాకేమీ అత్యుత్సాహం లేదు. మీకు ఉన్నట్లుంది. సాయిరెడ్డి ముందే విచారణకు వచ్చి జగన్‌పై ఏదో చెప్పబోతున్నాడనే భ్రాంతిని ఆంధ్రజ్యోతి కలిగించింది’’ అని వ్యాఖ్యానించారు. ఉన్నది ఉన్నట్లు రాయడం భ్రాంతా? లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం భ్రాంతా అన్నది సాయి రెడ్డికే తెలియాలి!