Raghurama Krishnam Raju: ఆమెకు జ్ఞాపక శక్తి రావాలని ప్రార్థిస్తున్నా
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:38 AM
డాక్టర్ ప్రభావతి వ్యవహారశైలి పట్ల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. ఆమెకి జ్ఞాపకశక్తి రావాలని ప్రార్థిస్తున్నానని, ఎవరి ప్రోద్బలంతోనో అర్థం లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు

డాక్టర్ ప్రభావతి ఎవరి ప్రోద్బలంతోనో మాట్లాడుతున్నారు: రఘురామరాజు
ఉండి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘తెలియదు... గుర్తు లేదు... గాయాలు ఎలా ఉంటాయో తెలియదు. వాటిపై అవగాహన లేదు... అంటూ డాక్టర్ ప్రభావతి చెప్పిన అబద్ధాల ద్వారా ఆమె ప్రవర్తన ఏమిటో అర్థమవుతోంది. తన కింద పనిచేసే వాళ్లు ఫైల్ తెస్తే తాను సంతకం పెట్టానని చెప్పడం దారుణం. ఆమెకు తిరిగి జ్ఞాపక శక్తి రావాలని, మంచిగా ఉన్నది వున్నట్టు చెప్పాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో అప్పటి గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మాట్లాడుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేసుల విచారణకు ఎవరైనా సహకరిస్తుంటారు. కానీ ఆమె మహిళై ఉండీ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్‌కు కనీసం అవగాహన ఉండదా? ఎవరి ప్రోద్బలంతోనో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తీరు మార్చుకుని విచారిస్తున్న అధికారులకు ఉన్నది ఉన్నట్టు చెబితే అన్నీ బయటకు వస్తాయి. హైకోర్టు సీనియర్ డాక్టర్లను నియమిస్తే వారెవరూ సంతకం పెట్టలేదు. అప్పుడు జూనియర్ డాక్టర్లను నియమించి డా.ప్రభావతిపై వత్తిడి చేసి సంతకాలు తీసుకున్నట్లు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన దానిలో వుంది. ఈ నెల 15న కోర్టు నంబరు 5లో ఐటెం 6గా ఈ మేటర్ లిస్ట్ అయింది. సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించే వరకూ డాక్టర్ ప్రభావతి ఎంతో చాకచక్యంతో ఎవరి కంటికీ కనిపించకుండా తప్పించుకున్న విషయం అందరికీ తెలుసు’ అని రఘురామ ఎద్దేవా చేశారు.