Purandeswari: పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:59 AM
జగన్ పోలీసులపై హేయ వ్యాఖ్యలు చేశారని పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

అమరావతి, మేడికొండూరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): పోలీసులపై మాజీ సీఎం జగన్ హేయమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆక్షేపించారు. పోలీసు శాఖలో పని చేసే వేలాది మంది మహిళల మనోభావాల్ని కించపరచడమేనని, పోలీసు శాఖకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గురువారం ‘పల్లెకు పోదాం చలో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలసి ఆరోగ్యకేంద్రం, సచివాలయాలు, ఆలయాలను పురందేశ్వరి సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ విద్వేషం, విధ్వంసం మినహా రాష్ట్ర అభివృద్ధికి జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. తాజాగా కేంద్రం అమరావతికి రూ.4,285 కోట్లు ఇవ్వడంతోపాటు తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ అభివృద్ధికి 1331 కోట్లు మంజూరు చేసిందన్నారు. రొయ్యలు, చేపల ఎగుమతులకు సంబంధించి అమెరికాతో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదింపులు జరపడంతో సుంకాల పెంపు 90రోజులు వాయిదా పడిందన్నారు.