Share News

ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగానికి సన్నాహాలు

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:27 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు

ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగానికి సన్నాహాలు

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలుత మే నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించిన రెండో దశ (జీఎస్2)ను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంపెక్స్‌ (ఐపీఆర్‌సీ) నుంచి షార్‌లోని లాంచ్‌ కాంప్లెక్స్‌కు తరలించే వాహనానికి ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ 24న జెండా ఊపినట్లు ఇస్రో శనివారం ప్రకటించింది. షార్‌ రెండో ప్రయోగ వేదిక సమీపంలోని వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో ఈ నెల మొదటివారంలో రాకెట్‌ మొదటి దశ అనుసంధాన పనులు ప్రారంభించారు. సోమవారం నుంచి రెండో దశ పనులు చేపడతారు. ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-09 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఎల్‌వీఎం3-ఎం5, టీవీ-డీ2 ప్రయోగాలు చేపట్టనున్నారు.


సెమీ క్రయోజెనిక్‌ పరీక్ష విజయవంతం

ఇస్రో భవిష్యత్తులో ప్రయోగించే వాహనాల్లో వినియోగించనున్న సెమీ క్రయోజెనిక్‌ ఇంజన్‌ హాట్‌ టెస్ట్‌ను విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో సెమీ-క్రయోజెనిక్‌ రెండో ఇంటిగ్రేటెడ్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. భవిష్యత్‌లో ప్రయోగించే వాహనాల కోసం లిక్విడ్‌ ఆక్సిజన్‌ (ఎల్‌వోఎక్స్‌), కిరోసిన్‌ ప్రొపెల్లెంట్‌ల కలయికతో పనిచేసే 2వేల కేఎన్‌ థ్రస్ట్‌ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మార్చి 28న నిర్వహించిన మొదటి హాట్‌టెస్ట్‌ విజయవంతమైన తర్వాత చేపట్టిన ఈ ఇగ్నీషన్‌ టెస్ట్‌ జెమీ-క్రయోజెనిక్‌ ఇంజన్‌ టెస్ట్‌ భావి పరీక్షలకు ఇది ఒక మైలురాయిగా ఇస్రో పేర్కొంది.


Also Read:

వీళ్లు వేడి నీళ్లు తాగకూడదు..

విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 27 , 2025 | 04:27 AM