YS Jagan: అసలేం జరిగింది..
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:23 AM
శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటనలో భద్రతపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్‌ను చుట్టుముట్టి బారికేడ్లను తొలగించిన తర్వాత హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడంపై దర్యాప్తు జరుగుతోంది

జగన్ పరామర్శ పర్యటనపై
పోలీసు దర్యాప్తు ప్రారంభం
హెలికాప్టర్ విండ్ షీల్డ్ నిజంగానే దెబ్బతిందా?
బారికేడ్లను, పోలీసులను తోసేసింది ఎవరు?
బెంగళూరు వెళ్లిన సీఐ బృందం
హెలికాప్టర్ కంపెనీ నిర్వాహకులతో భేటీ
వివరాలు చెప్పేందుకు సంస్థ నిరాకరణ
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడి సహకారానికి పోలీసుల యత్నాలు
పుట్టపర్తి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో భద్రతకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ మంగళవారం రావడం.. కుంటిమద్దిలో హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల హల్‌చల్.. హెలికాప్టర్‌ను చుట్టుముట్టి వీరంగం వేయడం.. పోలీసులు వలయంగా ఏర్పడి జగన్‌ను అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి పంపించడం తెలిసిందే. అయితే తమ నేతకు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని, హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడంతో ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లాల్సి వచ్చిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇది పోలీసుల వైఫల్యమని విమర్శించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై ఉన్నతాధికారులు పోలీసులను నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో హెలిప్యాడ్ వద్ద జరిగిన సంఘటనపై శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ధర్మవరం, పుట్టపర్తి డీఎస్పీల ఆధ్యర్యంలో విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనకు ఉపయోగించిన హెలికాప్టర్ పరిస్థితేంటో తెలుసుకునేందుకు హిందూపురం డివిజన్‌లోని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసుల బృందం బుధవారం బెంగళూరు వెళ్లింది. హెలికాప్టర్ ఏర్పాటు చేసిన కంపెనీ, నిర్వాహకులు, పైలట్ల వివరాలను సేకరించినట్లు సమాచారం. జగన్ ఎక్కడి నుంచి హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభించారు.. ఎన్ని గంటలకు బయల్దేరారు.. తిరుగు ప్రయాణం షెడ్యూల్‌లో హెలికాప్టర్ ఉందా.. ఎంత అద్దె చెల్లించారు తదితర వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడం నిజమేనా.. మరమ్మతులు చేయకుండానే హెలికాప్టర్ తిరిగి ఎలా వెళ్లగలిగిందో ఆరా తీస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ డోర్ లాగారని, పైలట్ బ్యాగ్‌ను తస్కరించారనే అంశాలపైనా విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులు కోరిన వివరాలను చెప్పేందుకు హెలికాప్టర్ సంస్థ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర పౌరవిమానాయన మంత్రి రామ్మోహన్‌నాయుడి సహకారం కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
పోలీసులు ముందే సూచించినా..
కుంటిమద్దికి హెలికాప్టర్ రాగానే వైసీపీ శ్రేణులు దాని వద్దకు దూసుకువెళ్లాయి. అడ్డుకున్న పోలీసులను పక్కకు తోసేశాయి. దీంతో జగన్‌ను అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి పంపేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. పాపిరెడ్డిపల్లి చిన్న గ్రామమని, జన సమీకరణ చేపట్టవద్దని పోలీసులు వైసీపీ నేతలకు ముందే సూచించారు. అయినా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వైసీపీ కార్యకర్తలను భారీగా సమీకరించారు. హెలిప్యాడ్ వద్దకూ భారీగా పంపించారు. హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లను వైసీపీ నాయకులే ఏర్పాటు చేయించారు. హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా వాటిని తోసేసుకుని, పోలీసులను పక్కకు నెట్టి వైసీపీ కార్యకర్తలు దానిని చుట్టుముట్టారు. ఇలా వెళ్లినవారిలో రాప్తాడు నాయకులు, కార్యకర్తలు ముందున్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హెలిప్యాడ్ నుంచి జగన్ పాపిరెడ్డిపల్లి వైపు వెళ్లగానే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతిన్నదని, వీవీఐపీని తీసుకెళ్లడం సాధ్యం కాదని పైలట్ చెప్పారని, జగన్ రోడ్డుమార్గాన బెంగళూరు వెళ్తారని క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీటిపైనా దర్యాప్తు జరుగుతోంది.