Share News

Pawan Kalyan: భూకబ్జాలను సహించం

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:54 AM

భూకబ్జాలను సహించబోమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి ఆయనే స్వయంగా కాకినాడ, విశాఖలో పర్యటించనున్నారు

Pawan Kalyan: భూకబ్జాలను సహించం

  • నేనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తా

  • తొలుత కాకినాడ, విశాఖలో తిరుగుతా భూదందా బాధితులతో మాట్లాడతా

  • అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలను, వారసత్వం గా వచ్చిన భూములను కాపాడుకోవడానికి సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. భూకబ్జాలను సహించబోమన్న ఆయన, దీనిపై నేరుగా బాధితులతో మాట్లాడేందుకు జిల్లాల్లో పర్యటించనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో అధికారులతో ఈ సమస్యపై టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పవన్‌ కల్యాణ్‌ సమీక్షించారు. కొద్ది రోజులుగా భూకబ్జాలు, తప్పుడు రెవెన్యూ రికార్డుల సమస్యతో బాధపడుతున్న వారినుంచి అభ్యర్థనలు అందుతున్నాయన్నారు. విశాఖ, కాకినాడ, తిరుపతి, కడప ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల తొలుత కాకినాడ, విశాఖలో పర్యటిస్తానని తెలిపారు. ‘‘గత ప్రభుత్వంలో కాకినాడ జిల్లా పరిధిలో ఓ వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు బ్రాహ్మణుల ఆస్తులు లాగేసుకున్నారు. సత్రం భూములు, దేవదాయ, ధర్మాదాయ ఆస్తులను కబ్జా చేశారు.


కాకినాడలో వ్యాపారుల భవనాలను తీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. తిరుపతిలోనూ మఠం భూములను ఆక్రమించి గేట్లు పెట్టారు. విశాఖనగర శివార్లు, పారిశ్రామికంగా విస్తరించిన ప్రాంతాల్లోని భూముల విషయంలో నాడు వివాదాలు సృష్టించారు. వీటన్నింటిపైనా నాకు ఫిర్యాదులు అందుతున్నాయి’’ అని చెప్పారు. ప్రజల ఆస్తులకు భరోసా కల్పిస్తూ చర్యలు తీసుకోవాలనీ, భూదందాలు, అక్రమాలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతం పంపాలని పవన్‌ ఆదేశించారు. ‘‘నేనే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా. వారి బాధలు తెలుసుకొని, భరోసా ఇస్తా. ఒకవేళ కూటమి నేతలు భూఆక్రమణలకు పాల్పడినట్టు తేలినా ఉపేక్షించం’’ అని స్పష్టం చేశారు.

Updated Date - Apr 19 , 2025 | 04:54 AM