Pawan Kalyan: వికసిత్ భారత్ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:17 AM
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికసిత్ భారత్‌కు కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం నిధుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ బలోపేతానికి సహకరించండి
ఆర్థిక సంఘానికి పవన్ కల్యాణ్ వినతి
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ లక్ష్యసాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం ఆర్థిక సహకారం ఎంతో అవసరమని తెలిపారు. బుధవారం సచివాలయంలో చైర్మన్ అరవింద్ పనగారియా, సీఎం చంద్రబాబుతో కలిసి ఆర్థిక సంఘం సమావేశంలో పవన్ మాట్లాడారు. గ్రామాల సమగ్రాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, వలసలు అరికట్టడం, ఆహార భద్రత వంటి లక్ష్యాల సాధన సాధ్యపడుతుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఆర్థిక సంఘం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను దాని ముందుంచారు. ‘పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులని నమ్ముతున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా.. 2024-25లో దాదాపు రూ.800 కోట్ల ఇంటి పన్ను వసూలు చేశామన్నారు. పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా సదుపాయం కల్పించి వాటిపై స్థానిక సంస్థలకు అజమాయిషీ కల్పించాం. 2026-27 నుంచి 2030-31 వరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.62,515కోట్ల నిధుల లోటు ఉంటుందని అంచనా. ఉమ్మడి గ్రాంట్లలో అత్యధిక శాతం స్థానిక అవసరాల అభివృద్ధికి వినియోగించాలి. స్థానిక సంస్థలకు నిధులు నేరుగా పంపిణీ చేస్తే అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది’ అని పవన్ వివరించారు.