Pawan Kalyan: ఏనుగుల సంచారంపై వాట్సాప్ ద్వారా అప్రమత్తం చేయండి
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:04 AM
త్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ సిబ్బంది గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి

అటవీ ప్రాంతంలోకి మళ్లించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలి
అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ సిబ్బంది గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏనుగు గుంపుల సంచారం, పంట పొలాల ధ్వంసం, ఇటీవల ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం... తదితర అంశాలపై సమీక్షించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ, పొలాలను ధ్వంసం చేసిన ఘటనపై అటవీ అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. నాలుగు పిల్ల ఏనుగులతో సహా 11 ఏనుగులు గుంపు కల్యాణి డ్యాం సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు ధ్వంసం చేశాయని, డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ... ఏనుగులు ఎటు వైపు వెళ్తున్నాయో పరిశీలించడానికి డ్రోన్లు వినియోగిస్తున్న క్రమంలో అవి వెళ్లే అవకాశమున్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపాలని సూచించారు. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపడాన్ని డీఎ్‌ఫవో, పీసీసీఎఫ్ కార్యాలయాలు పర్యవేక్షించాలన్నారు. ఏనుగుల గుంపు పొలాలపై పడకుండా, అటవీ ప్రాంతంలోకి మళ్లించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.