Share News

Organ Donation: ఏడుగురి జీవితాల్లో జ్యోతిర్‌ వెలుగులు

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:16 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించిన వ్యక్తి అవయవదానం చేసి మరో ఏడుగురు జీవితాల్లో వెలుగులు నింపారు.

Organ Donation: ఏడుగురి జీవితాల్లో జ్యోతిర్‌ వెలుగులు

  • బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి నుంచి అవయవాల సేకరణ

  • తిరుపతిలో విజయవంతంగా గుండె మార్పిడి

గుంటూరు మెడికల్‌, తిరుపతి (వైద్యం), జూలై 10 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించిన వ్యక్తి అవయవదానం చేసి మరో ఏడుగురు జీవితాల్లో వెలుగులు నింపారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. విజయవాడలోని గవర్నర్‌పేటకు చెందిన శొంటి జ్యోతిర్‌ భాను (56) ఈ నెల 7వ తేదీ ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం ఎదురుగా స్కూటీపై ట్రిపుల్‌ రైడింగ్‌ చేసుకుంటూ గుర్తుతెలియని వ్యక్తులు బలంగా ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలైన ఆయనను సమీపంలోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను గుంటూరులోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించి జీవన్‌దాన్‌ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అవయవదానం ఆవశ్యకతను తెలియజేసి వారి అనుమతి పొందారు. అనంతరం గురువారం దాత నుంచి గుండె, రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కళ్లను సేకరించారు. ఒక కిడ్నీని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ గుంటూరుకు, రెండో కిడ్నీని క్యాపిటల్‌ హాస్పిటల్‌కు, గుండెను తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి, ఊపిరితిత్తులను తెలంగాణలోని కిమ్స్‌ హాస్పిటల్స్‌కు (సికింద్రాబాద్‌), కాలేయాన్ని మణిపాల్‌ హాస్పిటల్స్‌కు, కళ్లు ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. అవయవదానానికి అంగీకరించిన జ్యోతిర్‌ భాను కుటుంబ సభ్యులను ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పోతినేని రమే్‌షబాబు అభినందించారు.


గ్రీన్‌చానల్‌ ద్వారా తిరుపతికి గుండె

బ్రెయిన్‌డెడ్‌ అయిన జ్యోతిర్‌ భాను గుండెను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దాదాపు 8 గంటలు శ్రమించి గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో ఇప్పటి వరకు 20 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాధ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 03:16 AM