Share News

Prasanna Kumar Reddy: ప్రసన్నకుమార్‌రెడ్డికి నో బెయిల్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:00 AM

కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది

Prasanna Kumar Reddy: ప్రసన్నకుమార్‌రెడ్డికి నో బెయిల్‌

  • ‘అర్నేశ్‌కుమార్‌ కేసు మార్గదర్శకాలు పాటించండి

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. అయితే ఆయనపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని గుర్తుచేసింది.అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్‌ జడ్జి బుధవారం ఉత్తర్వులిచ్చారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. దీని ఆధారంగా కొవ్వూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం.. ముందస్తు బెయిల్‌ కోరుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారరు. పిటిషనర్‌పై నమోదైన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. ఆ సెక్షన్లు ఆయనకు వర్తించవని తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో ఆమె అనుచరులు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారని.. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రతిష్ఠను దిగజార్చేలా పిటిషనర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఘటన జరిగిన తర్వాతి రోజు కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరో వీడియో విడుదల చేశారని తెలిపారు. అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నిందితుడిని అరెస్టు చేయాలో వద్దో నిర్ణయించే పూర్తి విచక్షణాధికారం దర్యాప్తు అధికారికి ఉందన్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన మాట్లాడడానికి వీల్లేదని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొందని.. ఆ తీర్పు ప్రతి ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడని అన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రసన్నకుమార్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని ప్రకటించారు. ఆయన విషయంలో అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులకు స్పష్టం చేశారు.

Updated Date - Jul 17 , 2025 | 03:00 AM