Share News

Nellore Floods: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు.. స్వర్ణముఖి నదికి పోటెత్తిన వరద

ABN , Publish Date - Dec 04 , 2025 | 09:25 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలకు స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. వాకాడు, కోట మండలాల్లో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. ఉప్పుటేరు వాగు ఉప్పొంగి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. కైవల్యా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కండలేరు వాగు సైతం..

Nellore Floods: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు.. స్వర్ణముఖి నదికి పోటెత్తిన వరద
Nellore Floods

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 4: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. ముఖ్యంగా గూడూరు డివిజన్‌లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజ్‌కి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 13 గేట్లు ఎత్తి వేసి.. 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.


వాకాడు, కోట మండలాల్లో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. వాకాడు మండలం సముద్ర తీర ప్రాంతాలైన దుగ్గరాజ పట్నం పంచాయతీ- కొండూరు పాలెం మధ్య రోడ్డు పై వరద నీరు పొంగిపొర్లుతోంది. రోడ్డు కోతకు గురికావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.


దాదాపు 300 కుటుంబాలు ఉన్న మత్స్యకార గ్రామం కొండూరు పాలెం జలదిగ్బందంలో చిక్కుకుంది. పంచాయతీ మోటర్ వైర్లు నీట మునిగి పోవడంతో తాగునీరు సరఫరా నిలిచిపోయింది. అయితే, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


అటు, చిల్లకూరు మండలం తిప్పగుంట పాలెం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెప్తా పై ఉప్పుటేరు వాగు ఉప్పొంగి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో జలదిగ్బందంలో తిప్పగుంట పాలెం వాసులు కొట్టుమిట్టాడుతున్నారు.


సైదాపురం మండలంలో కైవల్యా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. తురిమెర్ల వద్ద చెప్తాపై వరదనీరు ప్రవహిస్తోంది. మనుబోలు మండలంలో కండలేరు వాగు సైతం ఉదృతంగా ప్రవహిస్తోంది. బద్వేలు రోడ్డు సమీపంలో ఉన్న సంగమేశ్వరాలయం నీట మునిగింది.


ఇవీ చదవండి:

రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

జనరిక్‌ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2025 | 09:25 AM