Share News

AP Police: మాదకద్రవ్యాల కేసుల్లో ఆస్తులు సీజ్‌ చేస్తాం

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:56 AM

ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం మాదకద్రవ్యాల కేసుల్లో నేరస్తుల ఆస్తులే కాకుండా కుటుంబ సభ్యుల ఆస్తులూ సీజ్ చేస్తామని ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో ఆస్తులు సీజ్ చేయగా, 375 గ్రామాల్లో గంజాయి సాగు గుర్తించారు.

AP Police: మాదకద్రవ్యాల కేసుల్లో ఆస్తులు సీజ్‌ చేస్తాం

  • ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే అరెస్టులు

  • ఈగల్‌ టీమ్‌ ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడి

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎన్‌డీపీఎస్(నార్కోటిక్‌ డ్రగ్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌) కేసుల్లో నేరస్థుల ఆస్తులతోపాటు వారు లావాదేవీలు జరిపిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆస్తులను కూడా సీజ్‌ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర ఈగల్‌ టీమ్‌ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ను నియంత్రించడానికి ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటోందని, దీనిలో భాగంగా 45వేల ఈగల్‌ టీమ్‌లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్‌డీపీఎ్‌స చట్టం చాప్టర్‌ 5(ఎ) ప్రకారం మత్తుపదార్థాలు,మాదక ద్రవ్యాలు తయారు చేసేవారు, విక్రవించేవారితోపాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆస్తులను కూడా సీజ్‌ చేసే అధికారాలు ఉన్నాయన్నారు.


ఇప్పటివరకు గుర్తించిన 22 కేసుల్లో విచారణ చేపట్టామన్నారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో నేరస్థుల ఆస్తులను సీజ్‌ చేశామన్నారు. అల్లూరిజిల్లాల్లోని 9 మండలాల్లో గంజాయి పండించే 375 గ్రామాలను గుర్తించామని చెప్పారు. గంజాయి కేసులో ఎన్టీఆర్‌ జిల్లాలో ఇద్దరిని, కడప జిల్లాలో ఐదుగురిని ఎన్‌డీపీఎ్‌స చట్టం-1988 ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే అరెస్టు చేశామని చెప్పారు.

Updated Date - Apr 30 , 2025 | 05:56 AM